ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎర్రగడ్డ తండా సమీపంలో భక్తరామదాసు ప్రాజెక్ట్ ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు. రూ.307 కోట్లు వ్యయంతో కేవలం 11 నెలలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయబడింది. దీని క్రింద జిల్లాలో సుమారు 60,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు పట్టుదలగా కృషి చేయడం వలననే ఈ ప్రాజెక్టు 2 నెలలు ముందుగానే పూర్తయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
ఈ ప్రాజెక్టులో కాకరవాయి, సుబ్బిలేడు, బచ్చోడు, రఘునాధ పాలెం, లక్షిందేవిపల్లి తదితర గ్రామాలలో మిగిలిపోయిన పనులను రేపటి నుంచే మొదలుపెట్టి వాటిని కూడా ఇదే వేగంతో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణా ఇస్తే మీరేమి చేస్తారని ఆ రోజు హేళన చేసినవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ప్రశ్న అడిగితే పాలేరు ప్రజలే వారికి సమాధానం చెప్పగలరని అన్నారు. తెలంగాణాలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించడమే తన ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా నిర్మించి పొలాలకు తమ ప్రభుత్వం నీళ్ళు అందిస్తుంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక ముఠా కోర్టులలో కేసులు వేస్తూ వాటిని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. అటువంటి కాంగ్రెస్ నేతలు వ్రాసిచ్చిన స్క్రిప్టును చదివి తన ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, పలు సంక్షేమ పధకాల గురించి ఏమి తెలుసని కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయంలో ఎన్నడూ చేయలేనివి, ప్రజలు ఎన్నడూ ఊహించలేని ఇటువంటి పనులన్నిటినీ తెరాస సర్కార్ యుద్ద ప్రాతిపదికన చేసి చూపిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి ప్రాజెక్టులు, సంక్షేమ పధకాలను చూసి, తమ భవిష్యత్ ఏమవుతుందోననే భయంతోనే కాంగ్రెస్ నేతలు తన ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తూ అభివృద్ధి పనులకు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.