రంకెలు వేసినా శత్రువులు కారు

2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకొందామని ప్రయత్నించి భంగపడి కనీసం దానితో ఎన్నికల పొత్తులైనా పెట్టుకొందామని చాలా తహతహలాడింది. కానీ తెరాస ఆసక్తి చూపలేదు. అది భాజపాతో పొత్తులు పెట్టుకోవాలని ఆశపడింది. కానీ భాజపా ఆసక్తి చూపలేదు. అది తెదేపాతో పొత్తులు పెట్టుకొంది. ఈ పొత్తుల వ్యవహారం అంతా మన తెలుగు సినిమాలలో ముక్కోణపు లవ్ స్టోరీలాగ సాగింది. 

మళ్ళీ రెండున్నరేళ్ళ తరువాత ఆ లవ్ స్టోరీ మొదలైనట్లు కనిపిస్తోంది. తెదేపా-భాజపాలు కటీఫ్ చెప్పేసుకొన్నాక తెరాస-భాజపాలు దగ్గరవుతున్నట్లు కనిపించాయి. ఇక నేడోరేపో పొత్తుల పీటలు ఎక్కేయడమే తరువాయి అనుకొంటున్న సమయంలో భాజపాకి ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా మాయాబజార్ సినిమాలో మాయ శశిరేఖలాగ కనిపించడంతో ఒక్క దూకుదూకి దూరంగా పారిపోయింది. 

అందుకు కారణం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి శాసనసభ బడ్జెట్ సమావేశాలలోనే బిల్లు ప్రవేశపెడతానని కేసీఆర్ ప్రకటించడమే. అయన ముస్లిం ఓటు బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకొనే ఇందుకు సిద్దం అయ్యారని, అది తమకు ఆమోదయోగ్యం కాదని, దానిని తప్పకుండా తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తో సహా ఆ పార్టీ నేతలు అందరూ తెరాస సర్కార్ ను గట్టిగా హెచ్చరిస్తున్నారు. తెరాసతో పొత్తులు పెట్టుకొనే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించేశారు కూడా. 

అయితే తెరాస సర్కార్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించినా దానిని కేంద్రం కూడా ఆమోదిస్తే గానీ అమలుకాదనే సంగతి తెరాస సర్కార్ పై రంకెలు వేస్తున్న భాజపా నేతలకు కూడా తెలుసు. నాలుగైదు నెలల క్రితం రాహుల్ గాంధీ యూపిలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి అధికార సమాజ్ వాదీ ప్రభుత్వంపై ఈవిధంగానే రంకెలు వేశారు. కానీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తులు పెట్టుకొని, అఖిలేష్ యాదవ్ తో భుజాలు రాసుకొంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కనుక తెరాస-భాజపాలు కూడా ఆ వెసులుబాటు ఉందనే చెప్పవచ్చు. కాకపోతే అంతవరకు భాజపా కూడా రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడం కూడా అవసరమె కనుక తెరాస సర్కార్ పై రంకెలు వేయక తప్పడం లేదు అంతే.