కాంగ్రెస్ ఎంపి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ నాయకత్వం, 5 రాష్ట్రాలలో ఎన్నికలు, తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్ వంటి అన్ని అంశాలపై మాట్లాడారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ (కాంగ్రెస్ రహిత దేశం) చేద్దాం అని భాజపా పిలుపునిస్తోంది కదా? మరి కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా, “అసలు దేశం కోసం భాజపా ఏమి చేసిందని కాంగ్రెస్ ఉండకూడదని చెప్పుకొంటోంది? ఇస్రో వంటి దేశానికి వన్నె తెస్తున్న సంస్థలన్నీ ఆనాడు మా కాంగ్రెస్ ఏర్పటు చేసినవే కదా? ఈ రెండున్నరేళ్ళలో దేశ ప్రజలను నానా కష్టాలు పాలు చేయడం తప్ప ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా ఏమి చేశారు? ఆయన మా పార్టీని, రాహుల్ గాంధీని చూసి చాలా అభద్రతాభావంతో భయపడుతూ ఉన్నారు. అందుకే నిత్యం మా జపమే చేస్తుంటారు,” అని రేణుకా చౌదరి అన్నారు.
యూపి ఎన్నికలలో ప్రియాంకా వాద్రాను ముందుకు తీసుకురావడంపై అడిగిన ప్రశ్నకు “అది టీం స్పిరిట్. పార్టీని గెలిపించుకోవడానికి పార్టీలో అందరూ ముందుకు వస్తుంటారు. అంత మాత్రాన్న రాహుల్ ని పక్కనపెట్టేసినట్లు అనుకూకూడదు,” అని చెప్పారు.
రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలు, పార్టీ పగ్గాలు చేపట్టడం గురించి అడిగిన ప్రశ్నకు “ఆయనను అందరూ ‘అమూల్ బాయ్’ అంటే దానిని కాంప్లిమెంటుగా తీసుకొంటాము. ఆయన అందంగా ఉంటాడు. మృదువుగా మాట్లాడుతాడు. అవేమీ అవలక్షణాలు కావే. రాజకీయాలలో ఆయన తన స్వంత శైలిని ప్రదర్శిస్తున్నట్లు భావిస్తాము. అయన పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపట్టాలనేది మా పార్టీ అంతర్గత వ్యవహారం,” అని అన్నారు.
నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్ పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు “త్వరలో ఎన్నికలు జరుగబోతున్న 5 రాష్ట్రాలలో మా పార్టీయే గెలువబోతోంది. ఆ సంగతి మీరే స్వయంగా చూడబోతున్నారు. యూపిలో మేము స్వంతంగా అధికారంలోకి రాలేకపోయినా భాజపాను మాత్రం రానీయకూడదనే సమాజ్ వాదీ పార్టీతో పొత్తులుపెట్టుకొన్నాము,” అని రేణుకా చౌదరి చెప్పారు.