కేసీఆర్ ఏపికి రావడం లేదు

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విజయవాడ, తిరుమల పర్యటన వాయిదా పడింది. బెజవాడ కనకదుర్గమ్మ, తిరుమల శ్రీవారికి ఆయన ఈరోజు మొక్కులు చెల్లించుకోవాలనుకొన్నారు. కానీ అధికారిక కార్యక్రమాల వలన ఆయన పర్యటన వాయిదా పడింది. రధసప్తమి సందర్భంగా తితిదే అధికారులు కూడా హడావుడిగా ఉండటం మరొక కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున త్వరలోనే వీలు చూసుకొని ఈ మొక్కులు తీర్చుకోవాలనుకొంటున్నారు. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ, తిరుమల పర్యటన త్వరలోనే మళ్ళీ ఖరారు కావచ్చు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం భక్తరామదాసు ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించడానికి ఖమ్మం వెళ్ళబోతున్నారు. ఉదయం 9గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సూర్యాపేట చేరుకొంటారు. అక్కడ భోజన విరామం అనంతరం మద్యాహ్నం ఒంటి గంటకు పాలేరు చేరుకొని మిషన్ భాగీరధ ఇంటేక్ వెల్ పనులను పరిశీలిస్తారు. తరువాత మద్యాహ్నం 1.35గంటలకు ఎర్రగండా తండాలో భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభిస్తారు. తరువాత తిర్మలాయపాలెంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అది ముగియగానే హెలికాఫ్టర్లో హైదరాబాద్ చేరుకొంటారు.