నల్లగొండలో విషాదం

నల్లగొండ ఆర్టీసి బస్సు డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కొప్పోలు విష్ణు (58) రేపు అంటే మంగళవారం పదవీ విరమణ చేయవలసి ఉంది. తనకు ఆరోగ్యం బాగోలేదని కనుక చివరి రెండు రోజులు శలవు కావాలని అధికారులను అడిగారు. కానీ అధికారులు నిరాకరించడంతో ఆ శలవు చీటిని జేబులో పెట్టుకొని ఆదివారం ఉదయం బస్సు తీయవలసివచ్చింది. మండల కేంద్రం నుంచి గుండ్రవల్లికి ప్రయాణికులను ఎక్కించుకొని బయలుదేరారు. కానీ కొంత దూరం నడిపేసరికి గుండె నొప్పి మొదలయింది. వెంటనే బస్సును పక్కకు తీసి ఆపారు. ఒక నిమిషం తరువాత మళ్ళీ బస్సును స్టార్ట్ చేయాలని చూశారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో సీటులో అలాగే వెనక్కి వాలిపోయారు. అది గమినించి ప్రయాణికులు, కండెక్టర్ అందరూ కలిసి ఆయన సమీపంలోని చుండూరులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారని వైద్యులు చెప్పారు. 

డ్రైవర్ విష్ణు చనిపోతూ కూడా తన బస్సులో ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కానీ సుమారు మూడు దశాబ్దాలకు పైగా సంస్థకు సేవ చేసిన ఆయన ప్రాణాలను ఆర్టీసి అధికారులు కాపాడలేకపోయారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినా కనికరించలేదు. రెండు రోజుల్లో పదవీ విరమణ చేస్తున్నాడని తెలిసి కూడా ఆయన పట్ల జాలి, గౌరవం చూపలేదు. చూపి ఉండి ఉంటే విష్ణు చనిపోయి ఉండేవాడు కాదేమో? ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఇంటికి పెద్ద దిక్కు అయిన విష్ణును కోల్పోయేవారుకారేమో?

పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతుంటే, అధికారులకి మాత్రం ఆయన మాటలు చెవికి ఎక్కుతున్నట్లు లేవు. హాయిగా శేషజీవితం గడుపవలసిన తమ ఉద్యోగి తను బస్సులోనే ప్రాణాలు కోల్పోయేలా చేశారు. 

అందుకు నిరసన తెలుపుతూ నల్లగొండ ఆర్టీసీ డిపో ఉద్యోగులు, విష్ణు కుటుంబ సభ్యులు చుండూరులో నిన్న నిరసనలు తెలిపారు. విధి నిర్వహణలో ఉంటూ, ప్రయాణికుల ప్రాణాలు కాపాడి మరణించిన విష్ణుకి న్యాయం చేయాలని కోరారు. ఆయన పిల్లలలో అర్హులైనవారికి ఆర్టీసిలో ఉద్యోగం ఇవ్వడం ధర్మమే.