ఈరోజు భాజపా విడుదల చేసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల మ్యానిఫెస్టోలో గమనించాల్సిన ముఖ్యమైన హామీ ఏమిటంటే రాష్ట్ర చట్టాలను సవరించి వీలైనంత త్వరగా అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని. నిజానికి అది సాధ్యం కాదు కనుకనే ఇంతవరకు దేశాన్ని పాలించిన యూపియే, ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న ఎన్డీయే ప్రభుత్వాలు దాని జోలికి వెళ్ళడం లేదని అందరికీ తెలుసు. కానీ అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని మళ్ళీ హామీ ఇస్తోందంటే అధికారంలోకి రావడం కోసమే రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నట్లు భావించాలి లేదా ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని, ఎన్ని కష్టాలు, సవాళ్ళు ఎదురైనా వాటిని అమలుచేయగలమని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించి చూపారు కనుక ఒకవేళ యూపిలో భాజపా అధికారంలోకి వస్తే నిజంగానే బాబ్రీ మశీదు కూల్చిన చోటే రామమందిరం నిర్మించినా ఆశ్చర్యం లేదు. దాని వలన దేశం అల్లకల్లోలం అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, 2019 సార్వత్రిక ఎన్నికలలో దానిని రామబాణంలాగ భాజపా తన ప్రత్యర్ధుల మీద ప్రయోగించి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడవచ్చు కూడా. ఈ హామీపై కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు, మజ్లీస్ వంటి మతతత్వ పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో తేలికగానే ఊహించవచ్చు.
ఇది కాక భాజపా తన మ్యానిఫెస్టోలో ఇంకా ఏమేమీ హామీలు ఇచ్చిందంటే,
1. యువతకు ల్యాప్ టాప్, దానికి 1జిబి ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్.
2. 12వ తరగతి వరకు ఉచిత విద్య
3. ప్రతీ ఇంటికీ గ్యాస్ కనెక్షన్.
4. అంతర్జాతీయ స్థాయి గల 10 యూనివర్సిటీల ఏర్పాటు.
5. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 20,000 కోట్లు కేటాయింపు.
6. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం ఐదేళ్ళలో రూ.150 కోట్లు కేటాయింపు.
7. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయడం.
8. రాష్ట్రంలో 90శాతం యువతకు ఉద్యోగం లేదా ఉపాధి కల్పన.