డబ్బు సంపాదించుకోవడానికే పోటీ చేస్తున్నా!

నేను ప్రజాసేవ చేయాడానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకొనే నేతలని చూశాము కానీ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచి డబ్బు సంపాదించుకోవడానికే వచ్చానని ధైర్యంగా చెప్పేవాడిని ఏమనుకోవాలి? అతి నిజాయితీపరుడా లేక తెలివి తక్కువవాడా లేక వర్తమాన రాజకీయ నేతల తీరు గురించి చెపుతున్నాడనుకోవాలా? జనాలే ఆలోచించుకోవాలి. 

యూపి శాసనసభ ఎన్నికలలో దక్షిణ ఆగ్రా నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గోపాల్ చౌదరి తను రాజకీయాలలో చేరి డబ్బు సంపాదించుకోవడానికే పోటీ చేస్తున్నానని చెప్పుకొంటున్నాడు. అయితే తనకు రాజకీయాలలో అనుభవం లేదు కనుక ఏవిధంగా డబ్బు సంపాదించాలో తెలియదని, అధికారులే తనకు తప్పకుండా నేర్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ ప్రజలకు మాయమాటలు చెప్పి ఏకంగా దేశానికి ప్రధానమంత్రి అయిపోయారు. నేను కూడా ప్రజలకు మాయమాటలు చెప్పే గెలవాలనుకొంటున్నాను. గెలిస్తే ఆయన అడుగుజాడలలోనే ప్రజలను మభ్యపెడుతూ, మరో చేత్తో కావలసినంత డబ్బు సంపాదించుకొంటానని గోపాల్ చౌదరి చెపుతున్నాడు. 

గోపాల్ చౌదరి బహిరంగంగా చెపుతున్న ఈ మాటలనే చాల మంది ప్రజా ప్రతినిధులు ఆచరిస్తున్నారు. అయినా ప్రజలు వారినే ఎన్నుకొంటున్నారు. కానీ గోపాల్ చౌదరి మరీ ఇంత పచ్చిగా చెప్పేస్తుంటే జనాలు భయపడతారని గ్రహించినట్లు లేదు.