ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఫిబ్రవరి 11 నుంచి మొదలయ్యే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకొన్నారు. ఎందుకంటే, గత కొంత కాలంగా పార్టీలో జరిగిన కీచులాటల కారణంగా తమ పార్టీ, ప్రభుత్వం పరువు రోడ్డున పడటంతో ఈసారి ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించడం చాలా కష్టమనే అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. ఈ ఎన్నికలలో భాజపాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కనుక ఒకవేళ తను పోటీ చేసినట్లయితే, తన నియోజక వర్గంలో ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తుంది. దాని వలన రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు ఇంకా సన్నగిల్లుతాయని ఆయన అభిప్రాయం కావచ్చు. అలాగని తన మనసులో భయాలను పైకి చెప్పుకోలేరు కనుక తను 2018 వరకు ఎమ్మెల్సీగా కొనసాగాలనుకొంటున్నట్లు అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఈసారి ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం ఉదృతంగా ప్రచారం చేస్తానని చెప్పారు. అఖిలేష్ నిర్ణయం ఆ పార్టీ నేతలకు పెద్ద షాక్ వంటిదేనని చెప్పవచ్చు. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ కలిసి ఆదివారం సంయుక్తంగా ఒక ప్రెస్-మీట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తాజా సమాచారం.
అఖిలేష్ యాదవ్ నిర్ణయం సరైనదే అయినప్పటికీ ఎన్నికలకు ముందు ఇటువంటి నిర్ణయం ప్రకటించడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లు అవుతోంది. అది ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్లు సూచిస్తోంది. కనుక ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ఈ నిర్ణయాన్ని తప్పకుండా తమకు అనుకూలంగా మలుచుకొని ప్రచారం చేసుకొనవచ్చు.