తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇప్పుడు ఏదైనా మాట్లాడారంటే అది తెరాస సర్కార్ ని ఉద్దేశ్యించి చేసిన విమర్శలే అయ్యుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. గణతంత్రదినోత్సవ సందర్భంగా ఆయన నిన్న తమ కార్యాలయంలో జెండా ఎగురవేసిన తరువాత మాట్లాడుతూ “కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో అనేక సమస్యలు కనబడుతున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించవలసిన భాద్యత తెరాస సర్కార్ దే. కానీ దాని పాలన అంత సంతృప్తికరంగా లేదు. అన్ని వర్గాల ప్రజలలో అశాంతి కనబడుతోంది,” అని అన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ ఈవిధంగా తరచూ తెరాస సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ అది పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో అసంతృప్తిగా ఉన్న వివిధ వర్గాల ప్రజలతో కలిసి ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై తన పోరాటాలను ఉదృతం చేస్తున్నారు. కానీ ఆయన పోరాటాలకు ఫలితం, ముగింపు రెండూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనుక మున్ముందు ఆయన పోరాటాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.