నో డౌట్..ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి

పంజాబ్ శాసనసభకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరుగబోతున్నాయి. అంటే వారం రోజులు మాత్రమే సమయం ఉందన్నమాట! సరిగ్గా ఇటువంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అమరీందర్‌ సింగ్‌ గురించి ఒక పుకారు మొదలైంది. 

74 సం.లు వయసున్న అమరీందర్‌ సింగ్‌ ఈ ఎన్నికలలో గెలిచినా ఓడినా ఇవే తన ఆఖరి ఎన్నికలని, మళ్ళీ పోటీ చేయబోనని ఎన్నికల ప్రచారసభలలో పదేపదే చెపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలోనే ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వరకే అమరీందర్‌ సింగ్‌ బాధ్యత అని, ఆ తరువాత ఆయన ఆరోగ్య కారణాలతో తప్పుకొని సిద్దూ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు వీలు కల్పిస్తారని పుకార్లు మొదలయ్యాయి. ఈ పుకార్ల వలన పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని గుర్తించిన రాహుల్ గాంధీ అమరీందర్ సింగ్ తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్దని, ఎన్నికలలో గెలిచిన తరువాత కూడా ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రకటించి ఈ పుకార్లకు ముగింపు పలికారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మాదక ద్రవ్యాల సరఫరా, వ్యాపారాలను అరికడతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 

ఆయన ఆమాద్మీ పార్టీ మీద కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ డిల్లీని సరిగ్గా పరిపాలించలేకపోతోంది. కానీ అక్కడేదో ఘనకార్యాలు చేస్తున్నట్లు ఇక్కడకు వచ్చి ప్రచారం చేసుకొని ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. డిల్లీలో దాని పాలన ఎంత ఘోరంగా ఉందో తెలుసుకోవాలంటే డిల్లీలో ఉన్నా మీ బందువులను, స్నేహితులను అడిగి తెలుసుకోండి,” అని రాహుల్ గాంధీ సూచించడం విశేషం. 

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయని సర్వేలు జోస్యం చెప్పాయి. కనుక రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ కూడా పంజాబ్ పైనే దృష్టి కేంద్రీకరించి తమతమ పార్టీలను గెలిపించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.