ఆ పార్టీకి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసినట్లేనా?

తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం మొదలవడానికి అసలు కారణం భాజపాపై ఆ రాష్ట్ర ప్రజలలో గల వ్యతిరేకతేనని పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పడం ఆ రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్త కోణమేనని భావించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ చెపుతున్నట్లుగా నిజంగానే ఆ రాష్ట్ర యువత భాజపాను వ్యతిరేకించడం కోసమే జల్లికట్టు ఉద్యమం చేసినట్లు కనబడదు. అందరికీ పైకి కనబడుతున్న కారణం జల్లికట్టు వారి సంప్రదాయ క్రీడ కనుక దానిని అనుమతించాలనేది వారి డిమాండ్ గా కనిపిస్తుంది. కానీ అది ఎంత అకస్మాత్తుగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసిపోవడం చాలా అనుమానాలను కలిగిస్తోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దానిని అనుమతిస్తున్నట్లు ప్రకటించి దాని కోసం చట్టం తెచ్చిన తరువాత కూడా ఆందోళనకారులు తమ ఉద్యమం కొనసాగించడం, అకస్మాత్తుగా అది విద్వంసానికి దారి తీయడం, అంతవరకు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్న పోలీసులు రంగప్రవేశం చేయడం, మరుసటి రోజు నుంచి జల్లికట్టు గురించి మాట్లాడేవారే లేకపోవడం అన్నీ కలిపి చూస్తే అది బహుశః అధికార అన్నాడిఎంకె పార్టీ నడిపించిన రాజకీయ క్రీడేననే అనుమానం కలుగకమానదు. 

అన్నాడిఎంకె పార్టీలో పన్నీర్ సెల్వం, శశికళ గ్రూపుల మద్య జరుగుతున్న ఆధిపత్యపోరులో సెల్వంకు అండగా భాజపా నిలబడినట్లయితే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంది. కనుక భాజపాను అడ్డుకొని దూరంగా ఉంచడం కోసమే హటాత్తుగా ఈ ఉద్యమం మొదలైనట్లు కనిపిస్తోంది. కానీ ఆ ఉద్యమంలో జరిగిన నాటకీయ పరిణామాలను అన్నిటినీ కలిపి చూసినట్లయితే అది ఆ ఉద్యమం రాష్ట్ర యువత స్వచ్చందంగా వచ్చి చేసినట్లు కాక, శశికళ వర్గం సహాయసహకారాలు, ప్రోత్సాహంతోనే చేసినట్లు కనిపిస్తోంది. ఏమైనప్పటికీ జల్లికట్టుతో భాజపాకు తమిళనాడులో ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసినట్లే కన్పిస్తోంది. అటువంటి రాజకీయ చదరంగాన్ని స్పూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజలను కోరడం విచిత్రమే. అందుకే ప్రత్యేక హోదా ఉద్యమం ఆశించిన ఫలితం సాధించలేక రాజకీయ పార్టీల మద్య జరిగే ఆదిపత్యపోరుగానే మిగిలిపోతోంది.