పవన్ ఈసారి కాస్త పరువాలేదు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన పార్టీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రెస్-మీట్ పెట్టి మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈసారి అయన ప్రసంగంలో పరిపక్వత కనిపించిందనే చెప్పవచ్చు. కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లడాలని వచ్చినప్పుడు దానికే పరిమితం అయ్యుంటే దాని ప్రభావం బాగా కనపడి ఉండేది. కానీ వివిధ అంశాలపై తన ఆలోచనలు, అభిప్రాయలు అన్నిటినీ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని చెపుతున్నప్పుడు, దానికోసం తన భవిష్య కార్యాచరణను ప్రకటించకపోవడం లోపమేనని చెప్పవచ్చు. అయన ప్రసంగం వివరాలు క్లుప్తంగా: 

1. అనేక దశాబ్దాలుగా రాష్ట్రాభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వలననే జనసేన స్థాపించాను తప్ప అధికారం కోసం కాదు. చంద్రబాబు నాయుడు మంచి పరిపాలనా దక్షుడు, మోడీ మన దేశానికి, రాష్ట్రానికి ఏమైనా మేలు చేస్తారనే ఉద్దేశ్యంతోనే వారికి మద్దతు పలికాను.   

2. గత ఎన్నికల సమయంలో నేను భాజపాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు, నాకు రాజకీయ అనుభవం ఉందా? అని వారు నన్ను అడుగలేదు. అప్పుడు నన్ను బాగానే వాడుకొన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడిగితే ముందు రాజకీయాలు నేర్చుకొని రా అంటున్నారు.

3. నరేంద్ర మోడీ దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. 

4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మినీ భాజపాలాగ తయారైంది.

5. ప్రజలు మీ బానిసలు కాదని తెదేపా, భాజపాలు నేతలు అందరూ గుర్తుంచుకోండి.

6. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు.

7. వెంకయ్యనాయుడు తన స్వర్ణ భారతి ట్రస్ట్ మీద చూపినంత ఆసక్తి ప్రత్యేక హోదాపై చూపి ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేది. 

8. జల్లికట్టు అనేది ఎద్దులపోటీ కోసం చేసిన ఉద్యమం కాదు. తమిళప్రజలు, వారి రాష్ట్రం, సంస్కృతీ సంప్రదాయాలమీద భాజపా దాడి చేస్తోందనే భావనతో దానిని అడ్డుకొనేందుకే జరిగిన ఉద్యమం అది.

9. ఉత్తరాదివారు దక్షిణాది వారిపై పెత్తనం చలాయించాలని చూస్తే చూస్తే ఊరుకోరని జల్లికట్టు ఉద్యమం నిరూపించి చూపింది.

10. సుజన చౌదరి బ్యాంకులను మోసం చేశారు. ఆయనకు ఎవరు ఆ స్పూర్తినిచ్చారు?

11. రాయపాటి సాంబశివరావు ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. నీతి నిజాయితీలో సింగపూర్ తనకు ఆదర్శమని బాబు చెప్పుకొంటారు కనుక సుజన, రాయపాటి అక్రమాలపై విచారణ జరిపేందుకు ఒక జ్యూడిషియల్ కమిటీ వేయాలి. 

12. తెదేపా ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకొని తాత్కాలికంగా వాయిదా వేయగలరేమో కానీ శాస్వితంగా అడ్డుకోలేదు. 

13. రాజకీయాలలో నేను నమ్మిన సిద్దాంతాల కోసం స్వంత అన్ననే వదులుకొన్న వాడిని, తెదేపా, భాజపాలను వదులుకోలేనా? ఏపికి మేలు చేయనపుడు నేను మీతో ఎందుకు కలిసి పనిచేయాలో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు?

14. చెట్టంత కూతురికి పెళ్ళి చేసి పంపించిన రామ్ గోపాల్ వర్మ సిగ్గుశరం లేకుండా పోర్న్ స్టార్ ల గురించి మాట్లాడుతున్నారు. అందరి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. 

15. రాజకీయ పార్టీలన్నీ హార్స్ ట్రేడింగ్ చేస్తూనే ఉంటాయని అందరికీ తెలుసు. అందుకే ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడుని నిలదీయలేదు.   

16. తెదేపా, భాజపాలు అనేక తప్పులు చేస్తున్నప్పటికీ, ప్రతీ చిన్నతప్పుని పట్టుకొని నిలదీస్తుంటే, పరిపాలన సజావుగా సాగదనే ఉద్దేశ్యంతోనే నేను చాలా విషయాలలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాను తప్ప వారికి భయపడి కాదు. వారికి మద్దతు ఇస్తున్నానని దానర్ధం కాదు. 

17. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు పోరాడవలసిందే. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తరువాత మరోకమాట మాట్లాడితే ఊరుకోబోము.