జీ హుజూర్ కలెక్టర్లు!

ఒకప్పుడు తల్లితండ్రులు, “మావాడు పెద్దయ్యాక కలెక్టర్ అవుతాడుట” అని మురిసిపోతూ గొప్పగా చెప్పుకొనేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో కలెక్టర్ అంటే చాలా గొప్ప పదవి అనే అభిప్రాయం ప్రజలకి ఉండటమే కారణం. దశాబ్దాలు తరువాత కూడా నేటికీ ప్రజలలో ఆ అభిప్రాయం అలాగే ఉంది. కానీ మన కలెక్టర్లు ఆ గౌరవాన్ని నిలుపుకొంటున్నారా? హుందాగా వ్యవహరిస్తున్నారా? అంటే నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో జగిత్యాల కలెక్టర్ డా.శరత్, మెట్ పల్లి సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ వ్యవహరించిన తీరు చూస్తే కాదనిపిస్తుంది. 

ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కలెక్టర్ శరత్ చెప్పుకొంటే, సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ మరో అడుగు ముందుకు వేసి ప్రజలూ, మీడియా అందరూ చూస్తుండగానే, వేదికమీద కుర్చీలో ఆశీనురాలై ఉన్న నిజామాబాద్ ఎంపి కవిత వద్దకు వెళ్ళి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమెతో ఏదో మాట్లాడారు. 

ముఖ్యమంత్రిని, ఎంపిని గౌరవించడం అవసరమే. అదే మర్యాద కూడా. కానీ శిరస్సు వంచి పాదాభివందనం చేయడం ఎందుకు, మోకాళ్ళ మీద కూర్చొని మాట్లాడటం ఎందుకు? ఆ విధంగా ముఖ్యమంత్రి, ఆయన కుమార్తె పట్ల తమ విధేయత ప్రకటించుకొని వారిని ప్రసన్నం చేసుకోవడానికేనని అర్ధం అవుతూనే ఉంది. 

ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్నప్పుడు హుందాగా మాట్లాడుతూ, వ్యవహరించవలసిన కలెక్టర్, సబ్- కలెక్టర్ ఇద్దరూ కూడా సగటు రాజకీయ నేతల్లాగా వ్యవహరించడం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. వారి మాటలు, వారి ఫోటోలు అప్పుడే మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చేశాయి. వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి విధేయంగా ఉండటం అవసరమే. ప్రభుత్వ ఆశయాలు, ఆలోచనలు, దాని ప్రణాళికలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయడం అవసరమే. కానీ మాంసం తింటున్నామని ఎవరూ మెళ్ళో ఎముకలు వేసుకొని తిరుగరు కదా?