జగన్ కు వైజాగ్ లో నో ఎంట్రీ?

ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ ఈరోజు వైజాగ్ బీచ్ వద్ద కొందరు యువకులు నిర్వహించాలనుకొన్న మౌనదీక్షను జరుగకుండా పోలీసులు అడ్డుకొన్నారు. ప్రత్యేక హోదా కోసమే ఈరోజు సాయంత్రం వైజాగ్ లో వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయ్ రెడ్డిలను వైజాగ్ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకొన్నారు. దానితో వారు రన్ వేకు దగ్గరలోనే బైటాయించి నిరసనలు తెలిపారు. సుమారు గంటన్నర హైడ్రామా సాగిన తరువాత పోలీసులు నచ్చజెప్పి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరుగు విమానంలో హైదరాబాద్ కు త్రిప్పి పంపించేశారు. కానీ వైజాగ్ తో సహా రాష్ట్రమంతటా వైకాపా ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ, జనసేన కార్యకర్తలు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి నిరసనలు తెలియజేశారు. మొత్తం మీద ఏపి సర్కార్ జగన్మోహన్ రెడ్డిని వైజాగ్ లో అడుగపెట్టకుండానే వెనక్కి త్రిప్పి పంపించేసింది. 

రేపటి నుంచి విశాఖలో రెండురోజుల పాటు సి.ఐ.ఐ. భాగస్వామ్య సదస్సు జరుగబోతోంది. దానిలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి అనేకమంది పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులు పాల్గొనడానికి వస్తున్నారు. రేపటి సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి సదస్సుకు వచ్చిన వారు బస చేసిన ప్రాంతంలోనే ప్రత్యేక హోదా కోరుతూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలనుకోవడం రాజకీయ దురుదేశ్యమేనని తెదేపా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న జగన్, రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వస్తున్న పారిశ్రామికవేత్తలను వెనక్కి వెళ్ళిపోయేలా చేసేందుకే పనిగట్టుకొని వైజాగ్ వచ్చారని తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. 

వైకాపా వాదన అందుకు పూర్తి భిన్నంగా ఉంది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సదస్సులు నిర్వహించిందని, వాటి వలన కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందే తప్ప రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని వాదిస్తోంది. అదే...ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వాటంతట అవే తరలివస్తాయని, అప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్, దావోస్ లకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు కదా?” అని వాదిస్తోంది. ఎవరివాదనలు వారివే. ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయ ఆంశంగా మిగిలిపోయింది.