భారత్ కు అరుదైన గౌరవం

దుబాయ్ లక్షలాది భారతీయుల జీవితాలలో వెలుగులు నింపిన దేశం. లక్షలాది భారతీయుల స్వేదం, శ్రమ, నైపుణ్యంతో నిర్మితమై నేడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన దేశం. ఆ దేశంలో పనిచేస్తున్న లక్షలాదిమంది భారతీయులే రెండు దేశాల మద్య బలమైన వారధివంటివారు. భారత్-యూ.ఎ.ఈ.ల మధ్య చిరకాలంగా ఉన్న ఈ అవినాభావ సంబంధమే నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ మరొకమారు ప్రస్పుటంగా కళ్ళకు కట్టినట్లు కనబడింది.


గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిల్లీలో జరిగే వేడుకలకు యూ.ఎ.ఈ. యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జయీద్ నహ్యాన్ ను ముఖ్య అతిధిగా భారత ప్రభుత్వం ఆహ్వానించింది. యూ.ఎ.ఈ. కూడా భారత్ పట్ల అంతే గౌరవాభిమానాలు ప్రదర్శించింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా సుప్రసిద్దమైన దుబాయ్ లోని  బూర్జ్ ఖలీఫా టవర్ పై నిన్న అర్దరాత్రి నుంచి ఎల్ఈడి లైట్లతో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది. అది చూసి దుబాయ్ లో ఉన్న భారతీయులే కాకుండా భారత్ తో సహా వివిదదేశాలలో ఉన్న భారతీయులు అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఈసారి వేడుకల్లో మరో విశేషం ఏమిటంటే, యూఏఈకి చెందిన 170మంది సైనికులు కూడా పరేడ్ లో పాల్గొన్నారు.  

 బహుశః యూఏఈ ప్రజలు, ప్రభుత్వం కూడా తమ యువరాజును గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా భారత ప్రభుత్వం ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తుండవచ్చు. ఎందుకంటే ఏటా జరిగే ఈ వేడుకలకు ఏదో ఒక దేశాధినేతలను మాత్రమే భారత్ ఆహ్వానిస్తుంటుంది. మొట్టమొదటిసారిగా దేశాధినేత లేదా ప్రభుత్వాధినేత కాని యువరాజును ముఖ్య అతిధిగా ఆహ్వానించి గౌరవించింది. ఆయన యూఏఈ రాజ కుటుంబానికి చెందిన యువరాజు. భవిష్యత్తులో ఆ దేశానికి కాబోయే రాజుగారు. కనుక రెండు దేశాలు చాలా చక్కటి స్నేహపూరితంగా స్పందించాయని చెప్పవచ్చు. ఇది రెండు దేశాలకు ముఖ్యంగా భారత్ కు దీర్ఘకాలంలో చాలా మేలు కలిగించవచ్చు కూడా.