మోడీ అండ్ ట్రంప్ ఆర్ నౌ ఫ్రెండ్స్! ఇది ఫేస్ బుక్ లో కనిపించే మెసేజ్ కాదు... ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఇప్పుడు నిజంగానే స్నేహితులయిపోయారు. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత్ వరుసగా ఫోన్ చేస్తున్నవారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ 5వ స్థానంలో నిలిచారు. ఆయనకి వైట్ హౌస్ నుంచి నిన్న రాత్రి ఫోన్ వచ్చింది. మోడీ-ట్రంప్ ఇద్దరూ కాసేపు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలనలో సహకరించుకోవడం వగైరా రొటీన్ కబుర్లు అన్నీ చెప్పుకొన్నాక సాంప్రదాయం ప్రకారం “అమెరికాకు భారత్ మిత్రదేశం” అనే విషయాన్ని ట్రంప్ దొరగారు చెప్పేశారు. ఆ తరువాత ఇద్దరూ ఒకరినొకరు తమ దేశంలో పర్యటించవలసిందిగా ఆహ్వానించుకొని అందుకు అంగీకరించేశారు. పిలుపులు అయిపోయాయి కనుక అధికారులు వాటికీ త్వరలోనే ముహూర్తాలు కూడా ఖరారు చేసేయవచ్చు. ఆనక ట్రంప్ ‘రాజు వెడలె రవి తేజములరియగ..కుడి ఎడమల్డాల్ కత్తులు మెరియగా’ అన్నట్లుగా తన వైభవాన్ని చాటుతూ ఎయిర్ ఫోర్స్:1 విమానంలో భారత్ రావచ్చు. ఆయన వచ్చి వెళ్ళాక మోడీగారు ఖరీదైన సూటు ధరించి ప్రత్యేక విమానంలో అమెరికా పర్యటించడం కూడా ఖాయమే.
భారత ప్రధాని మోడీకి ట్రంప్ తన జాబితాలో 5వ స్థానం ఇచ్చారు గనుక అది మంచి సంకేతంగానే భావించవచ్చు. ఎందుకంటే ఆ స్థానం పాకిస్తాన్ కు ఇవ్వలేదు కనుక అనుకోవచ్చు. కనుక మోడీ ఆ స్థానాన్ని భద్రంగా నిలుపుకొంటూనే ట్రంప్ కు ఇంకా సన్నిహితం కాగలిగితే భారత్ కి చాలా మేలు కలుగవచ్చు. ఉన్నతవిద్యలు, ఉద్యోగాలు, భద్రత, వాణిజ్యం ఈ నాలుగు రంగాలలో ట్రంప్ దొరవారు భారత్ ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే పదివేలు.