తెలంగాణా రాష్ట్రంలో ఇంకా అప్పుడప్పుడు రాష్ట్ర వ్యతిరేకంగా అవాంచనీయ సంఘటనలు జరుగుతుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో తల్లాడ మండలంలో ముద్దునూరు గ్రామం సెంటర్లో తెలంగాణా తల్లి విగ్రహాన్ని స్థాపించడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఎవరో ఆ విగ్రహానికి నిప్పు పెట్టారు. త్వరలో విగ్రహావిష్కరణ చేయడానికి ఏర్పాట్లు జరుగుతుంటే ఇటువంటి నీచమైన పనికి పాల్పడటం చాలా దారుణం. స్థానిక తెరాస నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పిర్యాదు మేరకు స్థానిక తల్లాడ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. స్థానిక రాజకీయ గొడవలే ఇందుకు కారణం అయ్యుండవచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా తెలంగాణా తల్లి కేవలం తెరాస పార్టీకి చెందింది అనుకోవడం చాలా తప్పు. తెలంగాణా రాష్ట్రానికి, దాని సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఏర్పాటు చేసుకొన్న మూర్తి తెలంగాణా తల్లి. తన బిడ్డలు అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తుంది. అటువంటి తల్లి విగ్రహానికి కూడా నిప్పు పెట్టగల దుర్మార్గులు ఉంటారంటే నమ్మశక్యంగా లేదు. ఈ పని ఎవరు చేసినా వారిపై చట్ట ప్రకారం కటినమైన చర్యలు తీసుకోవడం అవసరమే.