కాపురమెట్టుంది కొడకా అంటే..

'కాపురమెట్టుంది కొడకా అంటే చిన్నిల్లా.. పెద్దిల్లా' అని అడిగినట్లు దేశరాజకీయాలలో చక్రం తిప్పే అమర్ సింగ్ మీడియాతో తన గోడు చెప్పుకోబోయి అందరి ఇళ్ళలో బాగోతాలు బయటపెట్టేసి వాళ్ళని కూడా తనతోబాటు రోడ్డు మీదకి ఈడ్చి పడేశారు. 

యూపిలో సమాజ్ వాదీ పార్టీలో తండ్రీకొడుకుల మద్య చిచ్చుపెట్టారని అందరూ తననే ఆరోపిస్తుండటంతో ఆయన ఇచ్చిన వివరణ అమితాబ్ ఇంటి పరువును రోడ్డున పడేసింది. అయన మీడియాతో మాట్లాడుతూ “ఎక్కడ ఎవరి మధ్య విభేదాలు తలెత్తినా అందరూ నన్నే ఆడిపోసుకోవడం అలవాటుగా మారిపోయింది. ములాయం, అఖిలేష్ లను నేనే విడగొట్టానంటారు. అంబానీ సోదరులు విడిపోతే అందరూ నన్నే అంటారు. అమితాబ్  బచ్చన్, జయ విడిపోతే దానికీ నాదే బాధ్యత అంటారు. నిజానికి వారిని నేను కలువక ముందే విడిపోయారు. అమితాబ్ బచ్చన్, జయబదూరీ చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారు. జయకి ఆమె కోడలు ఐశ్వర్య బచ్చన్ కి మద్య విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు వచ్చాయి. వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఉందని వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే,” అని అన్నారు.

అప్పుడు కానీ అమితాబ్ బచ్చన్ దంపతులు మద్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని ఇద్దరూ విడిగా ఉంటున్నారనే సంగతి లోకానికి తెలియలేదు. అమర్ సింగ్ అంతటితో ఆగలేదు. అమితాబ్ బచ్చన్ తన భార్యను సమాజ్ వాదీ పార్టీలో చేరనీయవద్దని తనకు చెప్పిన సంగతి కూడా బయటపెట్టేశారు. అంటే అయన పరోక్షంగా తన బార్యను కట్టడి చేస్తున్నారని చెప్పినట్లయింది. 

అమర్ సింగ్ చెప్పిన ఈ విషయంపై స్పందించిన అమితాబ్ బచ్చన్, “ ఆయన నా స్నేహితుడు. తన అభిప్రాయం చెప్పే హక్కు ఆయనకు ఉంటుంది,” అని క్లుప్తంగా చెప్పారు. కానీ అయన చెప్పిన విషయం అబద్దం అని ఖండించలేదు. అంటే అమితాబ్ దంపతుల మద్య మనస్పర్ధలు, వారివురు వేర్వేరుగా జీవిస్తుండటం నిజమేనని స్పష్టం అవుతోంది.