బాబు పక్కలో బల్లేలు ఎన్నో..

ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకి ఒకేసారి బోలెడు కష్టాలు చుట్టుముట్టాయి. ప్రత్యేక హోదా ఆందోళనలు, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర హడావుడి, పోలవరం ప్రాజెక్టులో తవ్విపోస్తున్న మట్టిని తమ పొలాలలో కుప్ప పోస్తునందుకు రైతుల నిరసనలు, వారి తరపున పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి హెచ్చరికలు, నిత్య అసంతృప్తవాది జగన్ విమర్శలు, ఆరోపణలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ప్రత్యేక హోదా సమస్యపై గత రెండేళ్ళుగా ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నా దానిని సాధించలేకపోతున్నాయి. కానీ వారు చేస్తున్న అందోళనల కారణంగా తెదేపా-భాజపాల మద్య భేదాభిప్రాయాలు మొదలవుతుంటాయి. మళ్ళీ తమ మద్య సంబందాలు గాడిన పెట్టడానికి చంద్రబాబు చాలా శ్రమపడవలసి వస్తుంటుంది. 

ఇక ముద్రగడ కూడా బాబుకి పక్కలో బల్లెంలాగే మారారని చెప్పక తప్పదు. ఆయన హడావుడి చేసినప్పుడల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కర్ఫ్యూ విదించవలసిరావడం, వందలామంది పోలీసులను, అధికారులను జిల్లాకు కేటాయించవలసి రావడం, అయన ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖలు వ్రాయడం, తెదేపా నేతలు ఘాటుగా జవాబులు ఈయడం మొదలైనవన్నీ రొటీన్ వ్యవహారంగా మారిపోయినా, ప్రభుత్వానికి చాల ఇబ్బందికరంగానే మారాయని చెప్పక తప్పదు. రేపటి నుంచి ముద్రగడ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించినందున అయనను గృహ నిర్బంధంలో ఉంచారు. 

ఏపి సిఎం చంద్రబాబు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎల్లుండి విశాఖలో పర్యటించబోతున్నారు. అదే రోజున ఆర్.కె.బీచ్ లో కొందరు యువకులు ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్ష చేపట్టడానికి సిద్దం అవుతున్నారు. దానిని అనుమతించబోమని పోలీసులు చెపుతుంటే, తప్పనిసరిగా అనుమతించవలసిందేనని పవన్ కళ్యాణ్ తెదేపా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సమస్యలన్నిటి నుండి చంద్రబాబు ఏవిధంగా బయటపడతారో చూడాలి?