ప్రత్యేకపోరాటంలో నేను సైతం...

ఒకప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే రాజకీయ పార్టీలు వాటి పరిష్కారం కోసం పోరాడేవి. కానీ ఇప్పుడు ఆ సమస్యపై వాటికి ఎప్పుడు ఆసక్తి, తీరిక ఉంటే అప్పుడే పోరాడటం నేటి ట్రెండ్. అందుకు చక్కటి ఉదాహరణగా ఏపిలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటాలను చెప్పవచ్చు. 

మొదట దాని కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. కానీ అది తమను మోసం చేసిందని ఏపి ప్రజలు భావిస్తునందున  దాని పోరాటాలను ఎవరూ నమ్మలేదు, పట్టించుకోలేదు. ఆ తరువాత నటుడు శివాజీ దాని కోసం ఉద్యమించాడు. అతనిని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డికి దాని మీద ఆసక్తి కలిగింది. అప్పుడు డిల్లీలో దీక్ష చేసి తిరిగి వచ్చి రాష్ట్రంలో బందులు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు అంటూ హోరెత్తించేశారు. కానీ జగన్ దీక్షను కూడా ప్రజలు పట్టించుకోకపోవడంతో ఆయన కూడా దానిని పక్కన పడేసి వేరే సమస్యలపై పోరాడుతున్నారు. 

వారి తరువాత ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు అకస్మాత్తుగా దాని మీద ఆసక్తి కలగడంతో ఆయన కూడా 3-4 సభలు నిర్వహించి, తాజాగా ఒక మ్యూజిక్ ఆల్బం కూడా విడుదల చేస్తున్నారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం పుణ్యమాని మళ్ళీ ఏపిలో ప్రత్యేక అగ్గి రాజుకొంది. ఆ ఉద్యమస్పూర్తితో జనవరి 26న విశాఖ రామకృష్ణా బీచ్ తీరంలో ప్రత్యేక హోదా కోసం మౌనదీక్ష చేయడానికి అందరూ కదిలిరావాలని కొందరు యువకులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి పవన్, జగన్ ఇద్దరూ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఏపి సర్కార్ కి మళ్ళీ అగ్నిపరీక్ష మొదలైనట్లే చెప్పవచ్చు.