హలో..దిసీజ్ డోనాల్డ్ ట్రంప్..

నేటి తాజా వార్త ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 11.30 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లడబోతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ దృవీకరించింది. ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇజ్రాయిల్, ఈజిప్ట్, కెనడా, మెక్సికో దేశాధినేతలతో మాట్లాడారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లడబోతున్నారు. 

భారత్ లోని అవుట్ సోర్సింగ్ సంస్థలు అమెరికాలోని ఉద్యోగాలను ఎత్తుకుపోతున్నాయని ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ, భారత్ పట్ల సదాభిప్రాయమే వ్యక్తం చేశారు. భారత్ తో సంబంధాలు ఇంకా బలోపేతం చేసుకోవాలనుకొంటున్నట్లు చెప్పారు. ఆయన సలహాదారుల బృందంలో భారత్ సంతతికి చెందినవారు కూడా ఉన్నారు కనుక భారత్ పట్ల ట్రంప్ అనుకూల వైఖరి కలిగి ఉండేందుకు వారు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేసే ఉండవచ్చు. 

అయితే ఇప్పటికిప్పుడు భారత్ కోసం డోనాల్డ్ ట్రంప్ పనిగట్టుకొని ఏమీ చేయకపోయినా, ఒబామాతో బలమైన స్నేహసంబంధాలు ఏర్పరచుకొన్నట్లుగానే ట్రంప్ తో కూడా మోడీ స్నేహం పెంచుకోగలిగితే, దీర్గకాలంలో అమెరికా వలన భారత్ కు లాభం కలుగకపోయినా నష్టం కలుగకుండా నివారించవచ్చు. ముఖ్యంగా హెచ్-1 బి వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కటినంగా ఉండబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడమే కాకుండా అప్పుడే అందుకు కొన్ని కటిన చర్యలు కూడా చేపట్టింది కనుక, ఆ కారణంగా ప్రవాసభారతీయులకు నష్టం కాకుండా మోడీ ప్రయత్నాలు చేయవచ్చునని అందరూ ఆశిస్తున్నారు. 

ట్రంప్, మోడీ ఇద్దరిలో వ్యాపారవేత్తలున్నారు. ట్రంప్ నేరుగా వ్యాపారాలు చేయగా మోడీ వ్యాపారానికి పెట్టింది పేరైన గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి. పైగా పరిస్థితులు, వ్యక్తులను బట్టి చాలా లౌక్యంగా వ్యవహరించే నేర్పున్నవారు. ఇద్దరి ఆలోచనలు, ఆశయాలు, వ్యవహార శైలి మద్య చాలా సారూప్యత ఉందనే భావించవచ్చు. కనుక ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ ను తప్పకుండా భారత్ గాడిలో పెట్టగలరని ఆశించవచ్చు.