త్వరలో జరుగబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందే కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల కమీషన్ (ఈసి) రెండూ లైన్ క్లియర్ చేసేశాయి. కానీ ఈసి కొన్ని షరతులు విదించింది. సోమవారం రాత్రి ఈసి బడ్జెట్ సమర్పణ విషయంలో కేంద్రానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు బడ్జెట్ లో కేటాయించిన అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ఆర్ధికమంత్రి పార్లమెంటులో ప్రకటించకూడదు. ఆ ఐదు రాష్ట్రాలలో ఇంతవరకు ప్రభుత్వం చేపట్టిన ఇకపై చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పకూడదు. ఆ రాష్ట్రాలలో ఓటర్లను ప్రభావితం చేయగల ఎటువంటి ప్రతిపాదన లేదా ప్రకటన చేయకూడదు. ఆ ఐదు రాష్ట్రాలకు బడ్జెట్ లో యధాప్రకారం అన్ని కేటాయింపులు చేసినప్పటికీ వాటి గురించి ప్రకటించడం, ఎన్నికలలో ప్రచారం చేసుకోవడానికి వీలులేదు.
కేంద్రప్రభుత్వానికి ఈసి మార్గదర్శకాలు జారీ చేయడం సబబే కానీ ఒకసారి బడ్జెట్ పూర్తి కాపీలు మీడియా చేతికి అందితే ఇంక కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా వాటి గురించి చాటింపు వేసుకోనవసరమే ఉండదు. భాజపా అనుకూల మీడియా ద్వారా ఆ పని చక్కబెట్టేస్తుంది. కనుక బడ్జెట్ లో ఆ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలన్నీ బయటకు రాకుండా నిరోధించినప్పుడే ఈసి అనుకొన్న ఆశయం నెరవేరుతుంది.