విజయనగరం జిల్లాలో కూనేరు వద్ద మొన్న అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మరణించగా, 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల వివిధ ప్రాంతాలలో వరుసగా ఇటువంటి ప్రమాదాలే జరిగి బారీగా ప్రాణ నష్టం జరుగుతుండటంతో వీటివెనుక ఏమైనా కుట్ర ఉందా లేక సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా? అనే కోణంలో ఎన్.ఐ.ఏ. కూడా దర్యాప్తు చేస్తోంది. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై మొదట అందరూ అది నక్సల్స్ పనే అని అనుమానించారు. కానీ రైల్వే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కమీషన్ బృందం జరిపిన ప్రాధమిక దర్యాప్తులో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
రైలు ఒక ట్రాక్ మీద నుంచి మరొక ట్రాక్ మీదకు మారేందుకు దోహదపడే సన్నటి పట్టం (టంగ్ రైల్) విరిగిపోయి ఉన్నందున, ఈ ప్రమాదం సాంకేతిక లోపం కారణంగానే జరిగి ఉండవచ్చని కమీషన్ భావిస్తోంది. విరిగిన పట్టాను, అక్కడ లభించిన ఇతర ఆధారాలను సేకరించి పరీక్షలు జరిపిన తరువాత ప్రమాదానికి గల అసలు కారణం తెలుస్తుందని తెలిపారు. సాధారణంగా చలీ కాలంలో పట్టాలు కొంత సంకోచిస్తుంటాయి. ఆ సమయంలో బలహీనంగా ఉన్నవి లేదా అంతర్గతంగా పగుళ్ళు ఏర్పడిన పట్టాలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడినట్లయితే అవి ఈవిధంగానే విరిగిపోతుంటాయి. బహుశః అదే కారణం అయ్యుండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.
మొదట ఇది తీవ్రవాదులో, మావోయిస్టుల దుశ్చర్యో అయ్యుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ సాంకేతిక లోపం అని తేలింది. ఆ రెంటిలో ఏ కారణం చేత ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖ వాటికి శాశ్విత పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది. లక్షలాది మైళ్ళ పొడవునా ఉండే రైల్వే పట్టాలను నిత్యం పరిశీలించడం కష్టం...వాటికి కాపలా కాయడం ఇంకా కష్టం...చలీ కాలంలో పట్టాలు విరగడం సహజమే గాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరగడం కూడా సాధారణమే..అని చేతులు దులుపుకోవడానికి లేదు.
రైల్వే స్టేషన్ లో అడుగుపెట్టిన వెంటనే “మీ ప్రయాణం సుఖవంతం అగుగాక” అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యం చేర్చడంలో రైల్వే శాఖ విఫలం అవుతోందని పదేపదే జరుగుతున్న ఇటువంటి ప్రమాదాలు నిరూపిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బు పిండుకోవడంలో రైల్వే శాఖ చూపించే తెలివితేటలు, చమత్కారం ప్రమాదాలు జరుగకుండా నివారించడంలో కూడా చూపించగలిగితే బాగుంటుంది.