జల్లికట్టుకి హోదాకి లింకేమిటి?

ఏపి సిఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేసరికి రాష్ట్రంలో మొదలైన ప్రత్యేక ఉద్యమాల సెగ తగిలడంతో ఆయన కాంగ్రెస్, జగన్, పవన్ అందరికీ కలిపి ఒకేసారి జవాబు చెప్పేశారు.  

“జల్లికట్టు ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయమంటున్నారు. ఏమైనా అర్ధం ఉందా? అసలు దానికీ దీనికి సంబంధం ఏమిటి? ప్రత్యేక హోదా ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇస్తుంటే తీసుకోవడానికి అభ్యంతరం దేనికి? అసలు ప్రత్యేక హోదాలో ఉన్నదేమిటి..ప్యాకేజీలో లేనిదేమిటి? ఎవరైనా వివరించగలరా?” అని ప్రశ్నించారు.

“ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రానికి చాలా నష్టం అయిపోతుందని మొసలి కన్నీళ్లు కార్చుతున్న కాంగ్రెస్ నేతలు తమ హయంలో రాష్ట్రం కోసం ఏమి చేశారు? రాష్ట్రానికి తీరని అన్యాయం  చేసి మళ్ళీ వాళ్ళే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కేకలు పెడుతున్నారు. అసలు వాళ్ళు అప్పుడే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం ప్రాజెక్టు విషయంలో వారు చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనవి. నేను పూనుకోకపోయుంటే ఆ ప్రాజెక్టు ఎప్పటికైనా పూర్తవుతుందా? దానిలో ఒక్క రాయి అయినా కదిలేదా? అసలు రాష్ట్రాభివృద్ధి కోసం వారు చేసిందేమిటి? ఇప్పుడు వ్రాసే లేఖలేవో అప్పుడే కేంద్రానికి వారి అధిష్టానానికి వ్రాసి ఉండవచ్చు కదా? వారి హయంలోనే రాష్ట్రాభివృద్ధి చేసి ఉండి ఉంటే నేడు ప్రత్యేక హోదా కావాలని అడిగే అవసరమే ఉండేది కాదు కదా? నేను రాష్ట్ర హితం కోరే కేంద్రప్రభుత్వంతో మంచిగా పోతుంటే దానిని తప్పు పట్టడమేనా?” అని కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపారు.

జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డు పడుతుండటమే ఆయన పని. ప్రభుత్వం ఏపని చేసినా విమర్శించడమే తప్ప దానిలో ఆయన మంచిని చూడలేరు. మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే అసూయతో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మమ్మల్ని విమర్శిస్తున్న వారికి కనీసం ఎప్పుడైనా గ్రామ పంచాయితీనైనా నడిపించిన అనుభవం ఉందా?” అని బాబు ప్రశ్నించారు. 

పవన్ కళ్యాణ్ న్ని ఉద్దేశ్యించి “కొందరు ఏమి జరుగుతోందో, దానిలో సాధకబాధకాలు ఏమిటో తెలియకుండా అవగాహనరాహిత్యంతో మాట్లాడుతుంటారు,” అని అన్నారు చంద్రబాబు నాయుడు.