ఏ ప్రభుత్వమైనా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుకొని తదనుగుణంగా సాగడం సర్వసాధారణమైన విషయమే. తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వం కూడా మరో దీర్గకాలిక ప్రాజెక్టును చేపట్టబోతోంది. హైదరాబాద్ నగరంలో జనాభా, దానితో బాటే ట్రాఫిక్ నానాటికీ చాలా విపరీతంగా పెరిగిపోతున్నందున, నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని 3కిమీ పరిధిలోనే కొత్తగా 13 మినీ నగరాలను నిర్మించాలని సంకల్పించింది. ఒక్కో నగరం ఒక్కో రంగానికి ప్రత్యేకంగా కేటాయించబోతోంది.
నిజానికి ఈ కాన్సెప్ట్ చాలా కాలం నుంచే అమలులో ఉంది. ఉదా: ఒకప్పుడు నగరు శివార్లలో గల పటాన్ చెరు, ఉప్పల్, కుషాయిగూడా, బొల్లారం, మియాపూర్ వంటి ప్రాంతలలో రకరకాల పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కానీ నగరం క్రమంగా విస్తరించడంతో అవన్నీ నగరంలో భాగంగా కలిసిపోయాయి.
వాటిలో శంషాబాద్, తిమ్మాపూర్ వద్ద ఏర్పాటు చేయబోయే మినీ సిటీలో హెల్త్ కేర్, ఘాట్ కేసర్: ఐటి, ట్రాన్స్ పోర్ట్, అంబార పేట: మీడియా, కీసరగుట్ట: నాలెడ్జ్ అండ్ సైన్స్ పార్కు, శామీర్ పేట: రిక్రియేషన్ పార్కులు వగైరా, తుక్కుగూడ: ఏరో స్పేస్, తెల్లాపూర్, నాగులా పూర్, మేడ్చల్: ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్, సరుకు నిలువ చేయడానికి గోదాములు, ఆదిభట్ల జంక్షన్: ఏరో స్పేస్ అండ్ ఐటి హార్డ్ వేర్, పఠాన్ చేరు: హోల్ సేల్ మార్కెట్, బొంగులూరు: ఎలక్ట్రానిక్ క్లస్టర్, గుండ్లపోచం పల్లి: బయోటెక్ పరిశ్రమలు.
ఈ విధంగా నగరం చుట్టూ వేర్వేరు రంగాలకు చెందిన పరిశ్రమలు, వాటి సమీపంలోనే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన నివాస ప్రాంతాలు నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మినీ నగరాలన్నిటినీ మెట్రో మరియు లోకల్ ట్రైన్స్ ద్వారా అనుసంధానించాలని భావిస్తోంది. ఒక్కో మినీ నగరం 28 చదరపు కిమీ విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తోంది. ప్రాధమిక అంచనా ప్రకారం ఈ 13 మినీ నగరాలకు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 13,997 కోట్లు అవసరం ఉంటుందని లెక్క గట్టారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణా ప్రభుత్వం చేపట్టాలనుకొంటున్న ఈ బృహుత్ పధకం చాలా అవసరమే. కానీ అది ఇదివరకు ప్రకటించిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, నగరంలో స్కై-వేలు,ఎక్స్ ప్రెస్ హైవేలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, నూతన సచివాలయం నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు వంటివే ఇంతవరకు పూర్తి చేయలేక చాలా ఆపసోపాలు పడుతోంది. అవి గాక హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, నగర శివార్లలో హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, ఎంటర్టెయిన్మెంట్ సిటీ నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులను కూడా ప్రకటించింది. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు.
అందువలన తెలంగాణా ప్రభుత్వం ఏ కొత్త ప్రాజెక్టు ప్రకటించినా ప్రజలు అపనమ్మకంగా చూస్తున్నారు. తెరాస సర్కార్ ప్రజలకు తమకు రంగురంగుల కలలు చూపిస్తూ మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. తెలంగాణా ప్రభుత్వం దూరదృష్టితో చేస్తున్న ఆలోచనలు, దాని ఆశయాలు, ప్రణాళికలు అన్నీ గొప్పగానే కనిపిస్తున్నాయి. కానీ ఆచరణకు నోచుకోకపోవడం వలన అభాసు పాలవుతోంది. కనుక ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణా ప్రభుత్వం నిబద్దత ఎంత ఉందనేది బడ్జెట్ లో అది చేసే కేటాయింపులను బట్టి స్పష్టత ఏర్పడవచ్చు.