ఫిబ్రవరి 4 నుంచి పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికలు మొదలవబోతున్నాయి. వాటి తరువాత వరుసగా ఉత్తరాఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా మొదలవుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రప్రభుత్వం 2017-18 సం.ల ఆర్ధిక, రైల్వే బడ్జెట్ కలిపి ప్రవేశపెట్టబోతోంది. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే, కేంద్రప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు కనుక ఎన్నికలు పూర్తయ్యే వరకు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆదేశించాలని ప్రతిపక్షపార్టీలు కేంద్ర ఎన్నికల కమీషన్ను కోరాయి. అదే సమయంలో ఎం.ఎల్.శర్మ అనే ఒక వ్యక్తి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన సుప్రీంకోర్టు, పిటిషనర్ వాదన అర్ధరహితమని కొట్టివేసి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వానికి అనుమతించింది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కనుక ఇక ఎన్నికల కమీషన్ కూడా అభ్యంతరం పెట్టకపోవచ్చు. కానీ కేంద్రప్రభుత్వానికి ఇది చాలా మంచి అవకాశంగానే భావించవచ్చు కనుక ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలలో ప్రజలకు వరాలు ప్రకటించి భాజపాకు మేలు కలిగించే ప్రయత్నం తప్పక చేసే అవకాశం ఉంది.