భగీరథ ప్రయత్నం ఫలించింది

తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వం రూ.701.46 కోట్లు విడుదల చేయడానికి అంగీకరించింది. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు శుద్ధి చేయబడిన మంచినీటిని అందించడానికి ఈ నిధుల ఉపయోగించాలని కోరింది. ఇదివరకు ఈ ప్రాజెక్టు కోసమే కేంద్రప్రభుత్వం రూ.98.54 కోట్లు నిధులు విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్-ఇన్ చీఫ్ సురేందర్ రెడ్డి డిల్లీ వెళ్ళి నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడి, రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల సమస్యలను, ఆ సమస్యలను అధిగమించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన ఈ పధకం గురించి వివరించారు. అంతకు ముందు సాగునీటి శాఖ మంత్రి టి. హరీష్ రావు డిల్లీ వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతిని కలిసినప్పుడు నిధుల విడుదల చేయవలసిందిగా అభ్యర్ధించారు. ఇక తెరాస ఎంపిలు కూడా నిధుల విడుదల కోసం కేంద్రప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. వారందరి భగీరథ ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు నిధులు విడుదలవుతున్నాయి. వీటితో మిషన్ భగీరథ పనులు ఇంకా వేగవంతం కావచ్చు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు శుద్ధి చేయబడిన మంచినీళ్ళు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు.