త్వరలో కేసీఆర్ ఏపిలో పర్యటన?

అవును..తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే..ఆంధ్రాలో పర్యటించబోతున్నారు. కానీ రాజకీయ కార్యక్రమాల కోసమో, శుభకార్యాలకు హాజరు కావడం కోసమో కాదు. మోక్కులు తీర్చుకోవడానికి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తిరుపతి వెంకన్నకు బంగారు ఆభరణాలు, బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కు పుడక చేయించి సమర్పించుకొంటానని కేసీఆర్ మొక్కుకొన్నారు. అవి తయారయ్యి చాలా కాలమే అయ్యింది కానీ గత రెండున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి తీరికలేని కార్యక్రమాల వలన మొక్కులు చెల్లించుకోలేకపోయారు. ఈ నెల 30వ తేదీన విజయవాడకు అక్కడి నుంచి తిరుమలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకోబోతున్నారు. మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు నిన్న తిరుమల చేరుకొని ఆలయ అధికారులతో కేసీఆర్ మొక్కు చెల్లింపు గురించి మాట్లాడారు. 

తిరుమల వెంకన్నకు రూ.3,70,76,200 ఖరీదు చేసే 14.900 కేజీలు బరువున్న బంగారు సాలిగ్రామ హారాన్ని, రూ.1,21,41,150 ఖరీదు చేసే 4.650 కేజీల బరువున్న కంటెను కీర్తిలాల్ కాళిదాస్ జ్యువలర్స్ చేసి సిద్దంగా ఉంచారు. వాటిని కేసీఆర్ వెంకన్నకు సమర్పించుకొంటారు. ఆ ఆభరణాలను సందర్భానుసారం లేదా ఉత్సవ సమయాలలో  వెంకన్నకు ధరింపజేయాలని కేసీఆర్ కోరుకొంటున్నట్లుగా మంత్రులు తితిదేకు తెలిపారు. వారు అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈనెల 30వ తేదీన వాటిని కేసీఆర్ స్వయంగా వారికి అందజేసి వెంకన్న దర్శనం చేసుకొంటారు.