ఏపిలో విజయనగరం జిల్లా కూనేరు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య 40కి చేరింది. ఈ ప్రమాదంలో 100మందికి పైగా గాయపడ్డారు. జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఒక ఏసీ, రెండు స్లీపర్ క్లాస్, 4 స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం అర్ధరాత్రిపూట జరుగడంతో వైద్య, సహాయ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. రైల్వే పోలీసుల ప్రాధమిక విచారణలో ఇది సహజంగా జరిగిన ప్రమాదం కాదనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక అనుమానాస్పద వస్తువు దొరికినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోనే ఉండటంతో ఇది వారి చర్యే అయ్యుండవచ్చని అనుమానిస్తున్నారు.
గత ఏడాది అక్టోబరులో ఆంధ్రా-ఓడిశా సరిహద్దులలో మల్కనగిరి వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 27 మంది నక్సల్స్ మృతి చెందారు. బహుశః దానికి ప్రతీకారంగానే వారు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇంతవరకు మావోయిస్టులు ఈ ప్రమాదంపై స్పందించలేదు. ఒకవేళ వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఆ విషయాన్ని ప్రకటించుకొన్నట్లయితే వారిపట్ల ప్రభుత్వం కటినంగా వ్యవహరించడమే కాకుండా ప్రజలలో కూడా వారిపట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. కనుకనే వారు ప్రకటించుకోలేదేమో? ఈ ప్రమాదం పట్ల రైల్వే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఏపి సర్కార్ ఈ ప్రమాదంపై సిఐడి విచారణకు ఆదేశించింది.