తమిళనాడు ప్రజల ఒత్తిడికి తలొగ్గి కేంద్రప్రభుత్వం జల్లికట్టు క్రీడపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ఆర్డినెన్స్ జారీకి సిద్దపడటంతో, అది ఏపిలో రాజకీయ పార్టీలకి స్పూర్తినిచ్చింది. కాంగ్రెస్, జనసేన పార్టీలు ఏపికి ప్రత్యేక హోదా సాధించడానికి ఉద్యమించవలసిన తరుణం ఆసన్నమయిందని వాదన మొదలుపెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపి కెవిపి దీని గురించి చంద్రబాబుకి బహిరంగ లేఖ వ్రాశారు. ఇప్పుడు ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా జల్లికట్టు స్పూర్తితో ఏపికి ప్రత్యేక హోదా సాధించడానికి ఉద్యమం ప్రారంభించవలసిన అవసరం ఉందని చెప్పారు.
ఏపి ఎంపిలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వంత వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం అని భావిస్తునందున, వారికి జల్లికట్టు ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందకపోవచ్చని, కానీ రాజకీయ నేతలు స్ఫూర్తి పొందలేకపోయినా ప్రజలు తప్పకుండా వారి పోరాటం నుంచి స్ఫూర్తి పొందుతారని పవన్ కళ్యాణ్ అన్నారు.
రఘువీరా రెడ్డి మాట్లాడుతూ, కనీసం తమిళ ప్రజల పోరాటస్పూర్తిని చూసయినా తెదేపా నేతలు సిగ్గు తెచ్చుకొని ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. లేకుంటే చంద్రబాబు చరిత్ర హీనుడు అవుతారని అన్నారు.
ఇంకా అసలైన వ్యక్తి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడవలసి ఉంది. ఏపికి ప్రత్యేక హోదా కావాలని ఆయన చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆ వేడి చల్లారిపోకుండా అప్పుడప్పుడు యువభేరీలు మొగిస్తున్నారు. కనుక ఆయన కూడా మళ్ళీ పకడ్బందీ వ్యూహంతో ఉద్యమం మొదలుపెడితే ఇక చంద్రబాబు నాయుడికికి, వెంకయ్య నాయుడుకి, రాష్ట్ర భాజపా నేతలకి మళ్ళీ అగ్నిపరీక్షలు మొదలైనట్లే భావించవచ్చు. ఈసారి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.
అన్నిటి కంటే చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే, ప్రత్యేక హోదాపై అధికార, ప్రతిపక్షాలు రెంటికీ నిజంగా ఆసక్తి లేదు. అది తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికి బలమైన ఆయుధంగా వాడుకొంటున్నాయి. జగన్ దానితో చంద్రబాబుని దెబ్బ తీయాలని చూస్తే, కాంగ్రెస్, తెదేపా, జనసేనలు దానితో భాజపాని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుంటాయి. అందుకే ఇంతవరకు ఏపికి ప్రత్యేక హోదా సాధించలేకపోయాయని చెప్పక తప్పదు.