“పేద ప్రజలని చంపడమే నక్సల్స్ పనా? ఇంకేమీ పనిలేదా? అవినీతిని అరికట్టడమే తమ ధ్యేయం అంటారు. కానీ అవినీతిపరులు అడవుల్లో ఉండరు కదా? మరి వాళ్ళెందుకు అడవుల్లో దాకొంటున్నారు? నక్సల్స్ కి దమ్ముంటే ఇక్కడికి వచ్చి నలుగురు ఎమ్మెల్యేలను కాల్చి పడేయోచ్చు కదా? అవినీతిపరులు ఇక్కడ ఉండరా? అందరినీ బెదిరించి బలవంతంగా డబ్బు గుంజుకొని పోవడం...అడవులలో డంపులలో దానిని దాచిపెట్టడం...నక్సల్స్ అందుకే ఉన్నారా?” ఈ మాటలు అన్నది ఎవరో సామాన్య వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడుపై తరచూ తీవ్ర విమర్శలు గుప్పించే భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
ఆయన శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, నోట్ల రద్దు వలన ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, మావోయిష్టులు, అసాంఘిక శక్తుల ఆట కట్టయిందన్నారు. ఆ సందర్భంగానే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వలన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవడం తప్పు కాదు కానీ ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఆయనే నలుగురు అవినీతిపరులైన ఎమ్మెల్యేలను చంపవచ్చు కదా అని అనడమే విస్మయం కలిగిస్తోంది. ప్రజలలో ఉన్న నేతలు నోరు జారితే ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవడానికి సోము వీర్రాజు మాటలు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.
గత ఏడాది ఆంధ్రా-ఓడిశా సరిహద్దుల వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 30 మంది మావోయిష్టులు మృతి చెందినప్పటి నుంచి మావోయిస్టులు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పగబట్టి ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వాళ్ళు విలేఖరుల వేషంలో వచ్చి డిల్లీలో ఏపి భవన్ లో రెక్కీ నిర్వహించారని కేంద్రం హోం శాఖ హెచ్చరించింది. మళ్ళీ ఇవ్వాళ్ళ కూడా మావోయిస్టుల వలన ఆయనకి చాలా ప్రమాదం పొంచి ఉందని, కనుక భద్రత ఇంకా కట్టుదిట్టం చేయాలని ఏపి పోలీస్ అధికారులను కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.