భారత్ పై కక్షకట్టినట్లు వ్యవహరిస్తున్న పాకిస్తాన్ చేతికి చిక్కిన భారత సైనికులు ఎవరైనా ప్రాణాలతో తిరిగిరావడం దాదాపు అసాధ్యం అని అందరూ నమ్ముతారు. కానీ పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్ చేతికి చిక్కిన రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాను చందు బాబులాల్ చౌహాన్ క్షేమంగా వెనక్కి తిరిగి రాబోతున్నాడు. అతనిని భారత్ కు అప్పగించబోతున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. కనుక అతను చాలా అదృష్టవంతుడేనని చెప్పక తప్పదు.
అతను జమ్మూ కాశ్మీర్ లో మెంధర్ జిల్లాలో సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తుండేవాడు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన తరువాత అతను పొరపాటున సరిహద్దు దాటి పాక్ సైనికుల చేతికి చిక్కాడు. సర్జికల్ స్ట్రయిక్స్ కారణంగా భారత్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ చేతికి అతను చిక్కడంతో అందరూ అతని ప్రాణాలపై ఆశలు వదిలేసుకొన్నారు. కానీ అప్పటి నుంచి హోంశాఖ, విదేశాంగ శాఖ పాక్ ప్రభుత్వంతో అతని విడుదలకు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. చివరికి వాటి ప్రయత్నం ఫలించి, అతనిని మానవతా దృక్పధంతో విడుదల చేయడానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. త్వరలోనే అతనిని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన వాఘా పోస్టు వద్ద భారత సైనికాధికారులకు అప్పగిస్తామని పాక్ ప్రకటించింది.
అప్పుడప్పుడు ఇరుదేశాలకు చెందిన సైనికులు, సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా పొరపాటున సరిహద్దులు దాటి వెళ్ళిపోతుంటారని, ఇరు దేశాల సరిహద్దుభద్రతా దళాలు చర్చించుకొని వారిని విడిచిపెడుతుంటాయని బి.ఎస్.ఎఫ్. ప్రతినిధి చెప్పారు. కానీ చందు బాబులాల్ చౌహాన్ సరిహద్దు దాటినప్పుడు ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నందున అతని విడుదల కష్టం అయ్యిందని చెప్పవచ్చు. ఏమైనప్పటికీ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కి మళ్ళీ క్షేమంగా ప్రాణాలతో ఇంటికి తిరిగి రావడం అతనికి పునర్జన్మ వంటిదేనని చెప్పవచ్చు.