ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రాంతాలు అతని కాలు సోకి అపవిత్రం అయిపోయాయంటూ తెదేపా కార్యకర్తలు పసుపు నీళ్ళు, గోమూత్రం చల్లి శుద్ధి చేశారు. అది చూసి తీవ్ర ఆగ్రహం చెందిన వైకాపా కార్యకర్తలు కూడా అమారావతిలో చంద్రబాబు నాయుడు పర్యటించిన ప్రాంతాలను శుద్ధి చేయడం మొదలుపెట్టారు.ఇరువర్గాలు పోటాపోటీగా శుద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడంతో వారి మద్య ఘర్షణ మొదలయ్యింది. పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టి పరిస్థితిని మళ్ళీ అదుపులోకి తీసుకువచ్చారు.
రాజధాని నిర్మాణం జరుగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ రైతులను రెచ్చగొట్టేందుకు అక్కడ పర్యటించారని తెదేపా నేతలు వాదిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్న జగన్ అమరావతిలో అడుగుపెట్టడానికి అనర్హుడని తెదేపా వాదన.
రైతులు సంతోషంగా భూములు ఇస్తున్నట్లయితే వారు న్యాయస్థానానికి, పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి ఎందుకు పిర్యాదులు చేస్తున్నారని వైకాపా ప్రశ్నిస్తోంది. తెదేపా ప్రభుత్వం రైతులను భయపెట్టి బలవంతంగా వారి భూములను గుంజుకొంటోందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా చాలా మంది రైతులు మీడియా ముందుకు వచ్చి అది నిజమేనని దృవీకరించడం విశేషం.
తెదేపా, వైకాపాలు రెండూ కూడా తాము రైతుల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నామని చెప్పుకొంటాయి. కానీ వారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటాయని ఈ శుద్ధి కార్యక్రమలు స్పష్టం చేస్తున్నాయి.