అది నోట్లు రద్దువంటిదే కానీ..

తెలంగాణా ప్రభుత్వం కూడా నోట్ల రద్దు వంటి ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. రైతుల పేరిట సృష్టించబడుతున్న నకిలీ పట్టాదారు పుస్తకాల వలన ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతోందని గుర్తించి, రాష్ట్రంలో ఉన్న 82లక్షల పట్టాదారు పుస్తకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. వాటి స్థానంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు గల కొత్త పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఒకవిధంగా ఇది కూడా నోట్ల రద్దు వంటి నిర్ణయమే. కానీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంటే మంచి ఫలితాలు ఆశించవచ్చు. 

నకిలీ పట్టాదారు పుస్తకాలను అరికట్టగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా కనీసం రూ.1,000 కోట్లు వరకు ఆదాయం మిగాలవచ్చని అంచనా వేసింది. కొంతమంది రైతుల పేరుతో నకిలీ పట్టాదారు పుస్తకాలను సృష్టించి, వాటిని బ్యాంకులలో పెట్టు పంట రుణాలు తీసుకొంటున్నారు. వాటిని బ్యాంక్ అధికారులు గుర్తించలేకపోతే, ప్రభుత్వం అందిస్తున్న పంట రుణాల మాఫీ పధకం ద్వారా కూడా లబ్ధిపొందగలుగుతున్నారు. కనుక ఈ నకిలీల బెడద వదిలించుకోవడానికి అన్నిటినీ రద్దు చేసి వాటి స్థానంలో ఆధునిక భద్రతా ప్రమాణాలు గల కొత్త పుస్తకాలను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభిస్తోంది. 

ఇందుకోసం రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమీషనర్ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. కొత్త పుస్తకాలను మీ సేవా కేంద్రాల ద్వారా అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక్కో పుస్తకానికి రూ.150 రుసుము వసూలు చేయబోతున్నట్లు సమాచారం.