తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ మొదలైన ఆందోళన ఉదృతరూపం దాల్చడంతో కేంద్రప్రభుత్వం అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు దానిపై తన తీర్పును వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు ఇవ్వాళ్ళ ప్రకటించింది. దాని కోసం కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడానికి సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇక దానిని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరో కోణంలో నుంచి చూస్తూ కేంద్రప్రభుత్వానికి చురకలు వేశారు. “దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (భారతీయులు అందరికీ ఒకే చట్టం) ప్రవేశపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్న కేంద్రప్రభుత్వానికి తమిళనాడులో జల్లికట్టు కోసం జరుగుతున్న ఉద్యమం కనువిప్పు వంటిది. భిన్న మతాలు, బాషలు, సంస్కృతులు ఉన్న భారతదేశంలో బలవంతంగా ఉమ్మడి పౌర స్మృతి రుద్దడం సాధ్యం కాదని అవి నిరూపిస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి కోరుకొంటున్న హిందుత్వ శక్తులకు జల్లికట్టు ఆందోళనలు కనువిప్పు వంటిదే,” అని ట్వీట్ చేశారు.