దానికి మేము ఒప్పుకోం: భాజపా

తెలంగాణా రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై భాజపా చాలా తీవ్రంగా స్పందించింది.

రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్దం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొనే అందుకు సిద్దం అవుతున్నారని మేము భావిస్తున్నాము. రాజ్యాంగం ప్రకారం 50శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఈయడానికి వీలులేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కనుక తెరాస సర్కార్ చేస్తున్న ప్రతిపాదన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది. కేసీఆర్ ఎప్పుడూ ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేక ధోరణి కనబరుస్తుండటం చాలా విచారకరం. అలాగే ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. ఒకవేళ ఆయన రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి 50శాతం మించకుండా ముస్లింలకిస్తున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలంటే తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసిలకు ఇస్తున్న రిజర్వేషన్లలో కొత్త విదించాల్సి ఉంటుంది. అలాగ చేస్తే ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి సాహసం చేయరనే ఆశిస్తున్నాము. రాజ్యాంగానికి లోబడి ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదు. కానీ సాధ్యం అవుతుంది అంటే ప్రజలను మభ్యపెడుతున్నట్లుగానే భావించవలసి ఉంటుంది. మా పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది,” అని అన్నారు.