దాని కోసం 2018 వరకు ఆగాల్సిందేనట!

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వచ్చా భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు, డిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ నేతలు, అధికారులు, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు అందరూ చీపుర్లు పట్టుకొని ఫోటోలకు పోజులు ఇవ్వడంతో ఆ పధకం గురించి ప్రజలలో చాలా అపోహలు ఏర్పడ్డాయి. బహుశః కేంద్రప్రభుత్వం ఆ విషయం గ్రహించిందో ఏమో చీపుర్లతో ఫోటోల పోజుల కార్యక్రమాలకి స్వస్తి పలికి దాని అసలు ఉద్దేశ్యం నెరవేరేందుకు గట్టిగా కృషి చేయడం మొదలుపెట్టింది. వాటిలో బహిరంగ మలవిసర్జనను అరికట్టడం కూడా ఒకటి. దాని గురించి మీడియా ద్వారా గట్టిగా ప్రచారం చేయడమే కాకుండా, మరుగుదొడ్ల నిర్మాణానికి భారీగా నిధులు కూడా మంజూరు చేస్తోంది. దానితో ఈ సామాజిక సమస్య క్రమంగా తగ్గుమొఖం పడుతోంది. అసలు అమెరికా వంటి అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతున్న ఈ రోజులలో ఇంకా ఇటువంటి సమస్యలపై పోరాడవలసి రావడమే చాలా బాధాకరం. ఈ సమస్యను గత ప్రభుత్వాలు అసలు గుర్తించకపోవడం వలననే ఇప్పుడు దాని పరిష్కారం కోసం నడుం బిగించవలసి వచ్చింది. 

తెలంగాణా రాష్ట్రంలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ చెప్పిన తాజా లెక్కలు వింటే దిగ్బ్రాంతి కలుగుతుంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 44 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని, వారిలో ఈ పధకం అమలులోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటివరకు 20లక్షల మంది మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకొన్నారని, మిగిలిన 24 లక్షల మంది వాటిని ఏర్పాటు చేసుకోవడానికి కనీసం మరొక ఏడాదిన్నర సమయం పట్టవచ్చని చెప్పారు. 

మరొక రెండు నెలలోగా రాష్ట్రంలో మెదక్, కరీం నగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలలో మరుగుదొడ్లు ఏర్పాటవుతాయి కనుక ఆ 7 జిల్లాలు బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించగలమని తెలిపారు. 

ఈ ఆత్యాధునిక యుగంలో ఇంకా ఇటువంటి సమస్యలుండటం, వాటి గురించి ఇంకా మాట్లాడుకోవలసి రావడం విచిత్రంగానే ఉంది. కనీసం ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించి, ప్రజలను చైతన్యవంతం చేసి వారికి ఆర్ధికసహాయం కూడా చేసి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంనందుకు చాలా సంతోషించవలసిందే.