తెరాసలోకి పార్టీ ఫిరాయించిన తెదేపా ఎమ్మెల్యేలపై 90 రోజులలోగా నిర్ణయం తీసుకోమని హైకోర్టు ఆదేశాలను స్పీకర్ మధుసూదనాచారి పట్టించుకోకుండా కోర్టు ధిక్కారనేరానికి పాల్పడినందుకు త్వరలోనే తను హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెదేపా ఎమ్మెల్యేల సంఖ్య గురించి తెరాస సర్కార్ శాసనసభలో ఒకలాగ, హైకోర్టులో మరొకలాగ చెపుతూ న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 90 రోజులలోగా నిర్ణయం తీసుకోమని హైకోర్టు కోరిన మాట వాస్తవమే. కానీ రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పరిధిలో గల అంశాలలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేవు. అందుకే ఈవిషయంపై నిర్ణయం తీసుకోవడం ఆయన విజ్ఞతకే వదిలిపెట్టింది. లేకుంటే కోర్టు ధిక్కారనేరానికి పాల్పడినందుకు హైకోర్టే ఈపాటికి ఆయనకు నోటీసులు పంపిఉండేది. రాజ్యాంగపరంగా తనకున్న ఈ హక్కు, అధికారం గురించి స్పీకర్ మధుసూదనాచారికి తెలుసు గనుకనే ఆయన కూడా హైకోర్టు చేసిన సూచనపై స్పందించలేదని చెప్పవచ్చు.
స్పీకర్ పరిధిలో ఉన్న ఇటువంటి వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదనే రాజ్యాంగంలోని నిబంధనను అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకొంటూ అనైతికం, అప్రజాస్వామికం అని తెలిసి ఉన్నప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. వారిని తామే స్వయంగా ఫిరాయింపజేసినందున వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్నాయి. వారు కూడా నిసిగ్గుగా ఒక పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ మరో పార్టీకి చెందిన ప్రభుత్వంలో మంత్రులు, సభ్యులుగా కొనసాగుతున్నారు. ఏపిలో కూడా 21 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. అక్కడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ సంగతులన్నీ మంచి రాజకీయ అనుభవజ్ఞుడైన రేవంత్ రెడ్డికి తెలియవనుకోలేము. కనుక ఆయన హైకోర్టుకు వెళ్ళాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.