“రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటికీ త్రాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడగము” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణా ఏర్పడితే మొట్టమొదట దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఆ తరువాత దానిని పక్కన పెట్టారు కనుక ఆయన ఈ ప్రతిజ్ఞకి కట్టుబడతారని అనుకోనవసరం లేదు. కానీ తన హామీని నిలబెట్టుకోవడానికి మాత్రం గట్టిగానే కృషి చేస్తున్నారని చెప్పక తప్పదు.
దీని కోసం ప్రారంభించిన మిషన్ భగీరథ పధకం ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రజలకు శుద్దమైన త్రాగునీటిని అందించడం, తద్వారా 1041 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు దాని నుంచి విముక్తి కల్పించడం. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు నీటిని అందించేందుకు వేస్తున్న పైపులకు పక్కనే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కూడా వేస్తూ అన్ని గ్రామాలకు మంచి నీళ్ళతో బాటు చవుకగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించాలనేది ఈ ప్రాజెక్టు మరో ముఖ్యోద్దేశం. ఐటి శాఖ మంత్రి కేటిఆర్ చేసిన ఆలోచన అది.
రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తున్నాయి. అందుకే కేంద్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు ఉదారంగా నిధులు మంజూరు చేస్తోంది. ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ళు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఒక్కో దశ పూర్తవుతున్న కొద్దీ రానున్న రోజులలో అన్ని గ్రామాలకు మంచినీరు సరఫరా మొదలవుతుంది.
ఈ ప్రాజెక్టు పురోగతి గురించి తెలుసుకోనేందుకు స్వచ్చా భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తన బృందంతో కలిసి గురువారం హైదరాబాద్ వచ్చారు. వారితో ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి, జగదీశ్ రెడ్డి తదితరులు ప్రగతి భవన్ లో సమావేశమయ్యి ఈ ప్రాజెక్టు గురించి వారికి వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వం ఇస్తానని చెప్పిన రూ.800 కోట్లు విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్ధనకు పరమేశ్వరన్ అయ్యర్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైతే అదనంగా కూడా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇవ్వాళ్ళ పరమేశ్వరన్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తారు.