తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శాసనసభలో మంత్రుల తీరును తప్పు పడుతూ వారు తోలుబొమ్మలుగా మిగిలిపోయారని విమర్శించారు. భూసేకరణ, మైనార్టీ సంక్షేమం, విద్యాశాఖకు సంబంధించిన విషయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖల మంత్రులకి జవాబులు చెప్పే అవకాశం ఈయకుండా అన్ని ప్రశ్నలకి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావే సమాధానాలు చెప్పడం చూస్తే వారందరూ పేరుకే మంత్రులన్నట్లుందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. శాసనసభలో మంత్రులు ఎవరికీ మాట్లాడే స్వేచ్చ కూడా లేకుండా చేసి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ తన చెప్పు చేతలలో పెట్టుకొంటుంటే, మంత్రులు కూడా ఆయన చేతిలో కీలుబొమ్మల్లాగ, తోలుబొమ్మలాగ వ్యవహరించారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.4,400 కోట్లు విడుదల చేయవలసి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పడానికి అర్ధం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సభ్యులు అడుగుతున్న అన్ని ప్రశ్నలకు సంబంధిత మంత్రుల చేత జవాబులు చెప్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావే ఎందుకు సమాధానాలు చెపుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మైనార్టీ సంక్షేమం గురించి మండలిలో జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జవాబులు చెప్పారు. అలాగే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూడా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఎన్నడూ జంకరు. అసలు మంత్రులు అందరూ స్వతంత్రంగా పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా అవసరమే. ఆవిధంగా చేయగలిగితే ప్రభుత్వం మరింత సమర్ధంగా, చురుకుగా పనిచేయగలగుతుంది.