రాష్ట్ర బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు?

నిన్నటితో రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసాయి. తరువాత కీలకమైన బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ నుంచే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోజున గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ మరునాడు అంటే ఫిబ్రవరి 16న రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ 2017-18 ఆర్ధిక సంవత్సరాలకి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారని తెలుస్తోంది.

గత ఏడాది రూ.1.3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి అది రూ. 1.5 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణా రావు, ఆ శాఖలో ఉన్నతాధికారులు కలిసి బడ్జెట్ లో చేర్చవలసిన అంశాలపై చర్చిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా బడ్జెట్ ని సిద్దం చేసి దానిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపిస్తారు. ఆయన సూచించిన మార్పులు చేర్పులను చేసి ఫిబ్రవరి మొదటి వారానికల్లా తో బడ్జెట్ ను సిద్దం చేస్తారు.