ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఎలా?

అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన కొన్ని గ్రామాల రైతులు నిన్న హైదరాబాద్ వచ్చి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్ని కలిసి ప్రభుత్వం తమకు తగిన నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తోందని పిర్యాదు చేశారు. దళితులమైన కారణంగా ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను స్వయంగా చూసి తెలుసుకొనేందుకు ఒకసారి తమ గ్రామాలలో పర్యటించాలని కోరారు. 

అదే విధంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను ఆనుకొని ఉన్న మూలలంక గ్రామంలో రైతులు మరొక రకం సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు కోసం తవ్విన మట్టి రాళ్ళను ఆ గ్రామంలోని రైతులకు చెందిన 207ఎకరాల పంట భూములలో కుప్పలు పోస్తున్నారు. ఆ భూములను డంపింగ్ యార్డుగా వాడుకొనేందుకు ఎకరానికి రూ.25లక్షలు ఇస్తామని ప్రభుత్వం, నిర్మాణ సంస్థ టాల్ స్ట్రాయ్ మొదట అంగీకరించాయి. కానీ డంపింగ్ చేయడం మొదలుపెట్టిన తరువాత ఎకరాకు రూ.19.50 లక్షలు మాత్రమే ఇస్తామని ఆ సంస్థ మొండికేసింది. అధికారులకి పిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని రైతులు పవన్ కళ్యాణ్ కు మోర పెట్టుకొన్నారు. 

వారి సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “రాజధాని నిర్మాణం కోసం రైతులు చాలా ఆనందంగా, స్వచ్చందంగా తమ భూములను ఇచ్చారని ప్రభుత్వం చెప్పుకొంటుంది. మరి అటువంటప్పుడు రైతులను ఈవిధంగా ఎందుకు ఇబ్బంది పెడుతోందో అర్ధం కాదు. ల్యాండ్ పూలింగ్ పద్దతిలో రైతులకు ఇస్తానన్న ప్యాకేజి అంతా ఇవ్వాల్సిందే. ఈ విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు న్యాయం జరిగేలా చూస్తాను. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల వలన రైతులకు, గ్రామీణ వ్యవస్థలకు నష్టం కలగకూడదు. త్వరలోనే ఆ గ్రామాలలో పర్యటిస్తాను,” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.