నేటితో శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ఉభయసభలను నిరవధికంగా వాయిదా పడ్డాయి. మళ్ళీ వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఈసారి శాసనసభ సమావేశాలు 18 రోజులపాటు ప్రతిపక్షాల నుంచి ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగడం విశేషం. మొత్తం 94 గంటల పాటు 15 వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశాలలో మొత్తం 16 బిల్లులకు ఆమోదముద్ర వేశారు. ఇంత హుందాగా అర్ధవంతంగా సమావేశాలు జరుగడం రాష్ట్రంలో, దేశంలో కూడా ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.
అధికార, ప్రతిపక్షాలు అన్ని అంశాలపై లోతుగా చర్చించాయి. ప్రతిపక్ష సభ్యులు చేసిన అనేక సూచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం మరో విశేషం. అలాగే సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు ఈ సమావేశాలలోనే ముఖ్యమంత్రి వరాలు, సంక్షేమ పధకాలు ప్రకటించడం మరో విశేషం. ఈసారి ఉభయసభలు జరిగిన తీరు దేశంలో అన్ని రాష్ట్రాలకు, చివరికి పార్లమెంటుకు కూడా ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రజలందరూ కూడా చట్టసభలలో ఈవిధంగానే అర్ధవంతమైన చర్చలు సాగాలని, ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపాలని ఆశిస్తుంటారు. కనుక ప్రజాభీష్టానికి అనుగుణంగా ఉభయ సభలను నిర్వహించిన ప్రభుత్వానికి, దానికి సహకరించిన ప్రతిపక్షాల సభ్యులకి, స్పీకర్ మధుసూదనాచారికి మండలి చైర్మన్ స్వామి గౌడ్ కి, ఉభయసభల ఉద్యోగులు అందరికీ అభినందనలు చెప్పడం ధర్మం.