పాలమూరు ప్రాజెక్టుకు భూసేకరణ నిజమా కాదా?

తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణను రాష్ట్రంలో ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకోసం కోర్టులకు కూడా వెళుతున్నాయి. ఆ కారణంగా ప్రాజెక్టులు పనులు ప్రారంభించడానికి అవరోధాలు ఎదురవుతున్నాయి. అవి సరిపోవన్నట్లు జాతీయ హరిత ధర్మాసనంలో కూడా మరో పిటిషన్ దాఖలైంది.

తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు పులుల అభయారణ్యం క్రిందకు వస్తుందని, కనుక దానిని అనుమతించరాదని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. దానికి తెలంగాణా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో మొదట ఆ ప్రాజెక్టు నిర్మించాలనుకొన్న ప్రదేశం అభయారణ్యంలోనే ఉండేదని, కానీ ఆ సంగతి తెలుసుకొన్న తరువాత దానిని వేరే చోటికి మార్చమని తెలిపింది. కొందరు రాజకీయ దురుదేశ్యంతో ఆ ప్రాజెక్టును అడ్డుకోనేందుకే ఈ కేసు వేశారు కనుక దానిని పట్టించుకోరాదని తెలంగాణా ప్రభుత్వం కోరింది. ఆ కేసు విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. 

భూసేకరణ విషయంలో ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నట్లయితే, ప్రతిపక్షాలు దానిని అడ్డుకోవడంలో తప్పు లేదు. కానీ అభయారణ్యం క్రిందకు వచ్చే ప్రదేశంలో తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మిస్తోందనే వాటి వాదనే నిజమనుకొంటే, ప్రభుత్వం అక్కడ రైతుల నుంచి భూసేకరణ చేయడం లేదని అర్ధం అవుతోంది. కానీ రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ చేస్తోందని వాదిస్తున్నారు కనుక అది అభయారణ్యం కాదని రుజువు అవుతోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా కూడా రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకోలేకపోతే ఇంకెప్పుడు ఏవిధంగా సాధ్యం అవుతుంది? అందరూ ఆలోచించాలి. రాజకీయాల కంటే వ్యవసాయం, రైతుల సంక్షేమమే ముఖ్యమని అధికార ప్రతిపక్షాలు గ్రహించడం చాలా అవసరం.