వద్దన్న కొడుకు కోసమే భాజపా తీర్ధం

నారాయణ్ దత్ తివారీ.. ఈ పేరు ఎప్పుడో విన్నట్లుంటుంది. కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఆయన ఘనకార్యాలను ఒకసారి గుర్తు చేసుకొంటే, తప్పకుండా ఆయన ఎవరో అందరికీ జ్ఞాపకం వస్తారు. ఆయన ఒకప్పుడు సమైక్య రాష్ట్రానికి గవర్నర్.. ఏడు పదుల వయసులో రాజ్ భవన్ లో రాసలీలలు చేసి ఆ పదవికి కళంకం తెచ్చిన ఘనుడు ఆయనే. ఆ కారణంగా తన గవర్నర్ పదవిని కోల్పోయారు. ఆ తరువాత అకస్మాత్తుగా చెట్టంత కొడుకు పుట్టుకు వచ్చి “నాన్న” అని పిలిస్తే షాక్ అయిపోయారు. ఒకప్పుడు తివారీ కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకుగా పనిచేసేవారు. అప్పుడు యవ్వనంలో రేసు గుర్రంలా దూసుకుపోయేవారు. ఆ దూకుడుతోనే ఉజ్వల అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో అక్రమ సంబంధం పెట్టుకొన్నారు. వారిరువురికీ పుట్టినవాడే రోహిత్ శేఖర్. 

సమాజానికి భయపడి అతనిని తన కొడుకుగా అంగీకరించకపోవడంతో అతనే నా తండ్రి అంటూ రోహిత్ శేఖర్ చాలా కాలం పాటు న్యాయ పోరాటం కూడా చేశాడు. అయినా తివారీ అతనిని తన కొడుకుగా అంగీకరించకపోవడంతో తండ్రీకొడుకులు ఇద్దరికీ డి.ఎన్.ఏ.పరీక్షలు నిర్వహించమని డిల్లీ హైకోర్టు ఆదేశించింది. అప్పుడు దిగివచ్చి రోహిత్ శేఖర్ ను తన కొడుకుగా స్వీకరించారు తివారీ. ఇంత ఘన చరిత్ర కలిగిన ఆయనను ఎలా మరిచిపోగలం? 

ఆ న్యాయపోరాటం పూర్తయిన తరువాత మళ్ళీ ఇప్పటి వరకు తివారీ కబుర్లు వినిపించనే లేదు. ఒకప్పుడు తను కాదన్న కొడుకు రోహిత్ శేఖర్ నే అయన వెంటబెట్టుకొని వచ్చి భాజపా అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరడంతో మళ్ళీ మీడియా దృష్టిలో పడ్డారు. ఆనాడు తను వద్దనుకొన్న ఆ కొడుకుకే ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలలో భాజపా టికెట్ ఇవ్వాలని అమిత్ షాను కోరుతున్నట్లు సమాచారం. ఆయనభాజపాలో చేరడం గొప్పవిషయమేమీ కాదు కానీ నీతి నిజాయితీ, నైతిక విలువలు...అంటూ చిలుపాలులు వల్లిస్తున్న భాజపా అటువంటి గ్రంధసాంగుడిని పార్టీలో చేర్చుకోవడమే చాలా విడ్డూరంగా ఉంది.