చిరస్మరణీయుడు

తెలుగు ప్రజలకి పరిచయం అవసరం లేని పేరు ఎన్టీఆర్. ఆయన చనిపోయి నేటికి 21సం.లు. నేటికీ ఆయన జ్ఞాపకాలు సజీవంగానే ఉన్నాయి. కొందరు ఆయనను నటుడుగా ఆరాధిస్తే మరికొందరు రాజకీయ నాయకుడుగా గౌరవిస్తారు. మరికొందరు అతనిలో బాషా ప్రేమికుడుని చూస్తుంటారు. ఆయనని ఏవిధంగా చూసినప్పటికీ ఆయనలో గొప్పదనమే కనిపిస్తుంది తప్ప వేలెత్తి చూపగల ఒక లోపం కూడా కనబడదు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అయనను ఒక పార్టీకి లేదా ప్రాంతానికి చెందినవాడిగా చూడకుండా సమానంగా గౌరవిస్తుంటారు. సాధారణంగా అటువంటి గౌరవం జాతీయనేతలకు, స్వాతంత్ర్య సమరయోదులకే దక్కుతుంది. అటువంటి అరుదైన గౌరవం దక్కించుకొన్న ఎన్టీఆర్ ధన్యజీవి.  

ఆయన చాలా హటాత్తుగా రాజకీయ ప్రవేశం చేసి పార్టీ స్థాపించిన 9నెలలోనే అధికారంలోకి రాగలిగారు. అదే విధంగా ఆయన నిష్క్రమణ కూడా హటాత్తుగా, చాలా విషాదంగా ముగిసింది. కారణాలు అందరికీ తెలిసినవే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు ఆయనను చూసి రాజకీయాలలో దిగి చతికిలపడినవారిని మనం చూశాము. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లుగా నేటికీ ఆయన పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న నేతలను మనం చూస్తూనే ఉన్నాము. అందరూ ఆయన ఆదర్శాలను వల్లించేవారే కానీ ఆచరణలో పెట్టినవారు కనబడరు. 

సినీ, రాజకీయ రంగాలలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పొగిడారు. అది నూటికి నూరు శాతం నిజమని అందరూ అంగీకరిస్తారు. కేవలం ఆయన మాత్రమే నాటికీ నేటికీ అందరివాడుగా నిలిచిపోయారు. అందుకే ఆయన చిరస్మరణీయుడయ్యారు.