యూపి శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అక్కడ చాలా ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అధికార సమాజ్ వాదీ పార్టీ, దాని ఎన్నికల చిహ్నం రెంటినీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే దక్కాయి. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని ములాయం ప్రకటించగానే, వెంటనే అప్రమత్తమైన అఖిలేష్ ముందస్తు జాగ్రత్తగా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.
తండ్రీకొడుకుల మద్య విభేదాలకు మూల కారణమైన అమర్ సింగ్ కూడా తననే నమ్ముకొన్న ములాయంకు హ్యాండిచ్చేసి భాజపాలో చేరిపోబోతున్నారు. ఒకవైపు తను స్థాపించిన పార్టీని, తన కన్న కొడుకే ఎగరేసుకుపోగా, మరోవైపు ఎవరి కోసమైతే కొడుకుతో గొడవ పడ్డారో అతను కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.కాంగ్రెస్ పార్టీ కూడా కొడుకుతోనే చేతులు కలిపేందుకు సిద్దం అవుతోంది.
ఇంతవరకు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన ములాయం సింగ్ ఈ పరిణామాలతో హటాత్తుగా ఏకాకిగా మిగిలిపోయారు. ఇప్పుడు అయన వెనుక పార్టీ లేదు..నేతలు లేరు..కన్న కొడుకు లేదు..చివరికి నమ్ముకొన్న మిత్రుడు కూడా లేడు. ప్రధానమంత్రి కావాలని కలలు గన్న పెద్దాయన ఏకాకీగా మిగిలిపోయాడు. తన ఉనికిని కాపాడుకోవడానికి ఏమి చేస్తారో? ఈ సమస్యల నుంచి ఏవిధంగా బయటపడతారో చూడాలి.