రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్, ఆ రెండు శాఖల ఉన్నతాధికారుల బృందంతో కలిసి నేటి నుంచి వారం రోజుల పాటు విదేశీ యాత్రలకు బయలుదేరుతున్నారు. వారు మొదట దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఆ తరువాత జపాన్ లో పర్యటిస్తారు. ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణ కొరియా నుంచి ఆ రంగంలో తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించేందుకు వారు కృషి చేస్తారు. తెలంగాణా ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తారు. ఈ పర్యటనలో వారితో కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని భావించవచ్చు. ఎలక్ట్రానిక్ రంగంలో జపాన్ దేశం అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసిందే. కేటిఆర్ బృందం జపాన్ పర్యటనలో ఆ రంగానికి చెందిన పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తారు. మళ్ళీ జనవరి 25న వారు స్వదేశానికి తిరిగిరాబోతున్నారని సమాచారం. కేటిఆర్ గత ఏడాది అమెరికా పర్యటించి అమెజాన్ వంటి పెద్ద సంస్థలను రాష్ట్రానికి రప్పించగలిగారు. కనుక ఈసారి జపాన్, దక్షిణ కొరియా పర్యటనలలో ఏమి సాధించుకొని వస్తారో చూడాలి.