తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస ప్రభుత్వం పాలనా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన కూడా ప్రతిపక్ష నేతలాగే వ్యవహరిస్తున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలలోకి రానని పదేపదే చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నయ పార్టీ స్థాపించవలసిన అవసరం ఉందా? అనే అంశంపై చర్చించేందుకు అడ్వకేట్స్ జెఎసి అధ్వర్యంలో హైదరాబాద్ లో మంగళవారం ఒక సభ జరిగింది. ఆ కార్యక్రమానికి ఆయనతో బాటు, ఆమాద్మీ పార్టీ బహిష్కృత నేత ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యి ప్రసంగించారు.
ముందుగా యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ “తెలంగాణా ఏర్పాటు వెనుక ప్రజల బలిదానాలు ఉన్నాయి. వారి రక్తం, చెమట, కలలు ఉన్నాయి. కానీ ఈ రెండున్నరేళ్ళ తెరాస పాలనలో రాష్ట్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఏ ఆశయాల కోసం ప్రజలు తెలంగాణా సాధన కోసం పోరాడారో అది నేరవేరనప్పుడు, తప్పనిసరిగా మళ్ళీ పోరాడవలసి ఉంటుంది. అందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అదే పద్దతి కూడా. వర్తమాన రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేదని గుర్తించినప్పుడు దానిని సరిచేయడానికి ఎవరో ఒకరు చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది,” అని అన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, “తెలంగాణా వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని, వలస పాలకుల పాలన ఉండదని భావించి 60 ఏళ్ళు కోట్లాడి తెలంగాణా సాధించుకొన్నాము. ఉద్యమాల నుంచే తెలంగాణావాదం పుట్టింది తప్ప రాజకీయాల నుంచి కాదు. కానీ తెలంగాణా ఏర్పడినా నేటికీ ఆంధ్రావాళ్ళే అన్ని రంగాలలో పెత్తనం చేస్తున్నారు. హైకోర్టుకి ఐదుగురు జడ్జీలు నియమించబడితే అందులో నలుగురు ఆంధ్రా వాళ్ళే. ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా హీరోలు, సినిమాలు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వారిదే పెత్తనం. ఇంకా వారి దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఇక రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు అసలు బాగోలేవు. విలువలతో కూడిన రాజకీయాలు జరగాలని మేము కోరుకొంటున్నాము. దాని కోసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని మేము భావిస్తున్నాము. అటువంటి ప్రయత్నాలకు తెలంగాణా జెఎసి మద్దతు ఇస్తుంది. కొత్త పార్టీ ఏర్పాటును కాలమే చెపుతుంది,” ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.