తమిళనాడులో మళ్ళీ రాజకీయ సంచలనం మొదలైంది. ఈసారి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆ సంచలనానికి తెర తీశారు. అధికార అన్నాడిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు ఎంజిఆర్ శతజయంతి సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి తను రాజకీయాలలోకి రాబోతున్నానని, తన తదుపరి కార్యాచరణను ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా ప్రకటిస్తానని తెలిపారు.
తమిళనాడు ప్రజల హృదయాలలో అమ్మ(జయలలిత)కు తప్ప వేరే ఏ అమ్మలకు స్థానం లేదని అన్నారు. జయలలిత మృతిపై మొదట అనుమానాలు వ్యక్తం చేసిన దీప, ఇప్పుడు తనకు ఎటువంటి అనుమానాలు లేవని చెప్పడం విశేషం. ఆమెకు అందించిన వైద్య చికిత్స గురించి ప్రజలందరికీ తెలియజేయాలని మాత్రమే తాను కోరుకొంటున్నానని దీప అన్నారు.
“నేను ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. నా జీవితం ప్రజల సేవకే అంకితం చేస్తాను. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తాను,” అని చెప్పారు.
ఆమె మీడియాతో మాట్లాడిన తీరును నిశితంగా గమనించినట్లయితే ఆమెకు తన అత్త జయలలిత అంత ధైర్యసాహసాలు, తెగువ లేవని అర్ధం అవుతోంది. అందుకే జయలలిత మరణించి నెలరోజులు పైనే అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేకపోయారు. స్థిరమైన నిర్ణయం తీసుకోలేక ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నారు.
ఈరోజుల్లో రాజకీయ పార్టీ పెట్టి నడిపించడం చాలా ఖరీదైన వ్యవహారమే అని అందరికీ తెలుసు. ఒకవేళ దీపకు అంత అంగబలం, అర్ధ బలం లేనట్లయితే ఆమె రాజకీయాలలోకి ప్రవేశించడం కష్టమూ, అనవసరం కూడా. బహుశః పార్టీ స్థాపనకు ఎవరైనా మంచి స్పాన్సర్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారేమో? ఒకవేళ ఎవరైనా దొరికినా అటువంటి పార్టీలు ఎంతో కాలం మనుగడ సాగించలేవు.